
( ఫిబ్రవరి 22 – జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్ )
ఫిబ్రవరి 22ను జమ్మూ కాశ్మీర్ సంకల్ప దివస్‌గా మనం దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఇదే రోజు 1994లో మన పార్లమెంటు ఒక ఏకగ్రీవ తీర్మానం ద్వారా జమ్మూకాశ్మీర్ భారత దేశంలో అవిభాజ్య అంతర్భాగమని, దీనిని దేశం నుంచి వేరుచేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా గట్టిగా, అన్ని పద్ధతుల్లో అడ్డుకుంటామని తీర్మానించింది. అంతే కాదు. ఇది జమ్మూ కశ్మీర్ విషయంలో దేశం దృఢ సంకల్పాన్ని, కృత నిశ్చయాన్ని ప్రతిబింబిస్తుంది.
ఈ తీర్మానంలో నాలుగు అంశాలున్నాయి. మొదటిది – జమ్మూ కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం. దీన్ని వేరుచేసే ఏ ప్రయత్నాన్నైనా ఎన్ని పద్ధతుల్లో అడ్డుకుంటాం. రెండవది భారతదేశపు ఐక్యత, సార్వభౌమత్వం, భౌగోళిక ఏకాత్మతను అడ్డుకునే ఏ ప్రయత్నాన్నైనా ఎదుర్కొనే సంకల్పం, సామర్థ్యం భారత్‌కు ఉంది. మూడవది – దురాక్రమణ ద్వారా ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలనుంచి పాకిస్తాన్ వైదొలగాలి. నాలుగు – భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎలాంటి జోక్యాన్నీ భారత్ సహించదు.
ఇది చాలా స్పష్టంగా భారత దేశపు జనమానసపు సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. జమ్మూ కాశ్మీర్‌ను భారత్ నుంచి ఎవరూ వేరు చేయలేరని, ఇప్పుడు మిగిలి ఉన్న ఏకైక సమస్య పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి సాధించుకోవడమేనని ఈ తీర్మానం చెబుతుంది. మనం గుర్తంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మన శత్రువు పాకిస్తాన్ 1లక్ష20 వేల747 చకిమీ భూభాగాన్ని దురాక్రమించుకుంది. ఇదే ఆక్రమిత జమ్మూ కాశ్మీర్. దీనికి ముజఫరాబాద్ రాజధానిగా ఉంది. ఇది కాక మిగతా భాగం గిల్గిత్ బాల్టిస్తాన్. దీనికి స్కర్దూ రాజధానిగా ఉంది. ఇవి రెండూ అంటే మీర్ పూర్ ముజఫరాబాద్, గిల్గిత్ బాల్టిస్తాన్‌లు పాకిస్తాన్ కబ్జాలో ఉన్నాయి. ఇవి కాక 1962 యుద్ధంలో చైనా ఆక్సాయి చిన్‌ను ఆక్రమించుకుంది. కాబట్టి ఈ భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నది పార్లమెంటు ఏకాభిప్రాయంతో చెప్పింది.
ఈ సందర్భంగా ఒక విషయం ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్న పదం వాడటం పొరబాటు. దీని వల్ల కేవలం కాశ్మీర్‌లోని కొంత భాగం మాత్రమే పాకిస్తాన్ చేతిలో ఉందన్న తప్పుడు భావన కలుగుతుంది. ఎందుకంటే ఆక్రమణకు గురైన ప్రాంతంలో జమ్మూకు చెందిన మీర్‌పూర్, కోట్లీ, భీమ్‌బేర్, దేవ్‌బటాలాలు ఉన్నాయి. కశ్మీర్ లోయలోని ముజఫరాబాద్, లడాఖ్ ప్రాంతానికి చెందిన స్కర్దూ, గిల్గిత్, బల్టిస్తాన్‌లు ఉన్నాయి. కాబట్టి దీనిని ఆక్రమిత జమ్మూకాశ్మీర్ అనాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అధికారికంగా పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ అన్న పదాన్నే ఉపయోగించాలని నిర్ణయించింది.
పాక్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్ నుంచి శరణార్ధులుగా వచ్చిన 12 లక్షల మంది నేటికీ జమ్మూలో నివసిస్తూనే ఉన్నారు. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో 24 స్థానాలు ఇప్పటికీ ఖాళీగా ఉంటున్నాయి. ఇవి మీర్‌పూర్, ముజఫరాబాద్, గిల్గిత్, బల్టిస్థాన్‌లకు చెందినవి. ఈ ప్రాంతాలనుంచి శరణార్థులుగా వచ్చిన వారికి, వారి సంతతికి ఆ ఖాళీ స్థానాలకు ఓటు వేసి, ప్రతినిధులను ఎన్నుకునే హక్కును కల్పించాలి. ఈ విధంగా ఆ ప్రాంతాలపై మనకున్న హక్కును మనం చాటుకున్నట్టవుతుంది. ప్రస్తుతం పాక్ దురాక్రమణలో ఉన్న గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు పాకిస్తాన్‌ను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. వారు బలవరిస్తాన్ ఉద్యమం పేరిట స్వతంత్ర పోరాటాన్ని చేస్తున్నారు. గిల్గిత్ బల్టిస్తాన్ నివాసులకు కనీస ఓటు హక్కులు లేవు. అక్కడి ప్రభుత్వాలకు ఎలాంటి నిర్ణయాధికారాలు లేవు. ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధీ లేవు. పూర్తిగా పాక్ సైన్యం ఆజమాయిషీ ఉంటుంది. అక్కడి ప్రజలు దీనిని వ్యతిరేకిస్తున్నారు. ఇదే పరిస్థితి ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోనూ ఉంది. కాబట్టి వీటిని విముక్తం చేయడం మన కర్తవ్యం.
జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసి అక్కడ అసెంబ్లీని ఏర్పాటు చేసేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ బిల్లు 2023, జమ్మూకశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్లు 2023ను కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ మన దేశంలో భాగమేనని స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా..పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌లో కూడా 24 స్థానాలను రిజర్వ్ చేసినట్లు ప్రకటించారు. ఏదిఏమైనా, మన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునే వరకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న పార్లమెంటరీ తీర్మానాన్ని పునఃసమీక్షించడం చాలా ముఖ్యం. ఆక్రమిత భూభాగాలను తిరిగి స్వాధీన పరుచుకోవడంలో అసంపూర్తిగా ఉన్న పనిని, భారత పార్లమెంటుకు దాని నిబద్ధతను ప్రజలు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. భూభాగాలు ఆక్రమణ ద్వారా కోల్పోవు, కానీ ఒక దేశం మరియు దాని ప్రజలు వాటిని మరచిపోయినప్పుడు మాత్రమే కోల్పోతాయి.





