News

వరకట్నం కట్టడికి 200 ఏళ్ల కిందటే ఉత్తర్వులు

236views

కేరళలో వరకట్న వేధింపులతో వివాహితల ఆత్మహత్యలు పెరుగుతున్న వేళ.. పూర్వపు ట్రావెన్‌కోర్‌ సంస్థానం మహారాణి గౌరీ పార్వతీ బాయీ రెండు శతాబ్దాల కిందటే ముందుచూపుతో జారీ చేసిన కీలక ఉత్తర్వులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ‘వర దక్షిణ’ పేరుతో ఇచ్చే సొమ్ముపై ఆమె పరిమితి విధించడం గమనార్హం. ట్రావెన్‌కోర్‌ (ప్రస్తుత దక్షిణ కేరళ) సంస్థానాన్ని మహారాణి గౌరీ పార్వతీ బాయీ 1815 నుంచి 1829 వరకు పరిపాలించారు.

ఆ సమయంలో సమాజంలోని కొన్ని వర్గాల్లో (ముఖ్యంగా బ్రాహ్మణ వర్గంలో) ‘వర దక్షిణ’ ఆచారం ప్రబలంగా ఉండేది. అబ్బాయి తరఫు వారు అమ్మాయి కుటుంబం నుంచి ఎక్కువ సొమ్ము డిమాండ్‌ చేసేవారు. ఫలితంగా అమ్మాయిలకు వివాహం కావడం కష్టమయ్యేది. పార్వతీ బాయీ ఆ సమస్యను గుర్తించి విస్తుపోయారు. పరిష్కార మార్గంగా 1823లో ఓ ఉత్తర్వు జారీ చేశారు. సంబంధిత ప్రతులు రాష్ట్ర ప్రాచీన పత్ర భాండాగారంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. బ్రాహ్మణుల్లో ప్రధానంగా నంబూథ్రి, పొట్టి వర్గాల మహిళల దుస్థితిని మహారాణి తన ఉత్తర్వులో ప్రధానంగా ప్రస్తావించారు.

ఆ వర్గాల్లోని అమ్మాయిలకు 10-14 ఏళ్ల మధ్య వివాహం కావాల్సి ఉన్నా.. వరకట్నం కింద అబ్బాయిలు 1,000-2,000 ఫనమ్‌లు (అప్పటి డబ్బు) డిమాండ్‌ చేస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. అమ్మాయిల కుటుంబాలు అంత మొత్తాన్ని ముట్టజెప్పలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వర దక్షిణ కింద 700 ఫనమ్‌ల కంటే ఎక్కువ అడగకూడదని స్పష్టం చేశారు. తన ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

కేరళలో వరకట్న వేధింపులు, వాటి వల్ల మహిళల ఆత్మహత్యలు గత రెండేళ్లలో ఎక్కువయ్యాయి. మరింత బంగారం, విలాసవంతమైన కారు, ఇతర ఆస్తులు కావాలని భర్త వేధించడంతో ఇటీవల ఓ వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ట్రావెన్‌కోర్‌లో పార్వతీ బాయీ తన హయాంలో విద్యను బాగా ప్రోత్సహించారు.