
భక్తుల కల్పవల్లిగా ప్రసిద్ధికెక్కిన చల్లని తల్లి ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల మహోత్సవం ఈనెల 19 నుంచి ప్రారంభం కానుంది. మాఘశుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి ) పర్వదినాన ప్రారంభమై 15 రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. తిరునాళ్ల మహోత్సవానికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుంటారు.
ఎదురుగండ దీపాలతో హారతులు
అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సోమవారం రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. తొలుత ఆచార సంప్రదాయం ప్రకారం పట్టణ పోలీసులు అమ్మవారికి చీర, సారె, పసుపు కుంకుమలు సమర్పిస్తారు. పారుపూడి, నెరుసు వంశస్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. మెట్టనింట కొలువైన అమ్మవారిని బయటకు తీసుకొచ్చి పల్లకిలో కూర్చుండబెడతారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఎదురుగండ దీపాలతో హారతులతో స్వాగతం పలికి భక్తిపారవశ్యం చెందటంతో ఊరేగింపు మొదలై అమ్మవారు బయలుదేరుతుంది. ఊరేగింపు అనంతరం రెండో రోజు ప్రధాన సెంటరులో ఊయల ఉత్సవం జరుపుతారు. ఊయల ఉత్సవం పూర్తికావటంతో కనక చింతయ్య సమేతంగా అమ్మవారు ఆలయ ప్రవేశం చేసి భక్తుల పూజలందుకుంటారు.
శిడిబండి వేడుక
అమ్మవారి తిరునాళ్లలో 11వ రోజు ఈనెల 29న నిర్వహించే శిడిబండి వేడుక ప్రధాన ఘట్టం. ఉయ్యూరు దళిత వాడ నుంచి పెళ్లి కుమారుడు ఊరేగింపుగా తరలివచ్చి ప్రత్యేకంగా తయారుచేసిన శిడిబండిలో ఊరేగటంతో ఈ ఘట్టం ముగుస్తుంది. శిడిబండి ఉత్సవాన్ని తిలకించేందుకు అశేష భక్తజనం తరలివస్తారు. ఉత్సవాల్లో ప్రధానంగా జోడిపొట్టేళ్లు బండ్లు ఆకర్షణగా నిలుస్తాయి. భక్తులు జోడు పొట్టేళ్ల ప్రభ బండ్లతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కుబడులు చెల్లించుకుంటారు. భక్తుల పూజలతో మార్చి 4న ఉత్సవాలు ముగుస్తాయి. అనంతరం అమ్మవారు ఊరేగింపుగా మెట్టినింటికి చేరుకుని పూజలందుకుంటారు.
మంత్రి జోగి రమేష్ సమీక్ష
ఉత్సవాల నిర్వహణపై రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ సమీక్ష నిర్వహించనున్నారు. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, ఆలయ పాలకవర్గంతో సమీక్ష జరిపి ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటారని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.





