
భారతదేశ కీర్తిప్రతిష్ఠలు ప్రపంచవ్యాప్తంగా చాటేలా అంతరిక్షంలో భారత్ స్పేస్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్టు ‘చంద్రయాన్–3’ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వీరముత్తువేల్ తెలిపారు. నీలగిరి జిల్లా ఊటీలో ఓ ప్రైవేటు కళాశాలలో ‘అంతరిక్షంలో భారత్’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన వీరముత్తువేల్ చంద్రయాన్ ప్రాజెక్ట్ గురించి ప్రసంగించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ‘ఇస్రో’ ఆధ్వర్యంలో రిమోట్ సెన్సింగ్, సమాచార సాంకేతిక, వాతావరణం, జీపీఆర్‌ఎస్, సముద్ర గర్భంల గురించి పరిశోధనలు జరుపుతున్నట్టు తెలిపారు. అంతేకాకుండా అంగారక, సూర్య గ్రహాలపై పరిశోధన నిమిత్తం ఉపగ్రహాలను ప్రయోగించామని, ప్రస్తుతం అవి విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. 2040లోపు చంద్రునిపైకి మానవుడిని పంపే ప్రక్రియ పూర్తిచేస్తామని, చంద్రయాన్ ఉపగ్రహం ల్యాండర్, రోవర్‌లతో రూపొందించామని, దీని ఆయుష్షుకాలం ముగిసిందని, ఏ లక్ష్యంతో దీన్ని ప్రయోగించామో ఆ లక్ష్యం నెరవేరిందన్నారు. ఇస్రో తరఫున అంతరిక్షంలో భారత్ స్పేస్ సెంటర్‌ను ఏర్పాటుచేసే చర్యలు కూడా ముమ్మరం చేసినట్టు వీరముత్తువేల్ పేర్కొన్నారు.





