రాష్ట్ర ప్రభుత్వం దేవాలయాలను సైతం రాజకీయాలకు వేదికగా మార్చేశారు.గుంటూరు జిల్లాలోని పలు ఆలయాల స్థాయిని పెంచారు. ఆయా దేవాలయాలకు ఇప్పటి వరకు ఈవోలు ఉండగా, ఇప్పుడు దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పర్యవేక్షణ సాగించనున్నారు. అయితే రాజకీయ కారణాలతో ఉత్తర్వులకు అడ్డుకట్ట వేస్తున్నారు. తమ ప్రాబల్యం తగ్గుతుందనే కారణాలతో నాయకులతో పాటు కొంతమంది సిబ్బంది తెర వెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఉత్తర్వులు అమలు కాకుండా అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఎంతో పవిత్రమైన ఆలయాల్లో రాజకీయాలు ఏంటని సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోటప్పకొండ కొండ తిరునాళ్ల అంటే పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. ఉమ్మడి గుంటూరే కాదు తెలంగాణ, చెన్నై, బెంగళూరు ఇలా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు మహాశివరాత్రికి కోటప్పకొండకు వస్తుంటారు. ప్రభల ఊరేగింపు ఇక్కడి ప్రత్యేకత. సాధారణ రోజుల్లో అక్షరాభ్యాసం, బాలలకు నామకరణం, వాహన పూజలు వంటివి కోటప్పకొండపై జరుగుతుంటాయి. నిత్యం పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. శివరాత్రి పండగకు జరిగే జాతరను ప్రభుత్వం స్టేట్ ఫెస్టివల్(రాష్ట్ర పండగ)గా ప్రకటించారు. కానీ ప్రభుత్వం ఒక రూపాయి కూడా విదల్చడం లేదు. ప్రస్తుతం ఆలయ పర్యవేక్షణను ఈవో స్థాయి నుంచి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి పెంచింది. ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో కొత్త అసిస్టెంట్ కమిషనర్(ఏసీ)గా శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించడానికి ఈనెల 10న కోటప్పకొండకు వచ్చారు. కానీ అధికార పెత్తనం ఆయన్ను విధుల్లోకి చేరకుండా అడ్డుకట్ట వేసింది. తిరునాళ్ల తర్వాత రావాలని అనడంతో చేసేదిలేక ఆయన వెనుదిరిగారు. తమ ప్రాబల్యం తగ్గుతుందనే ఉద్దేశంతో నాయకులు అడ్డుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
జాతరపై కానరాని సమీక్షలు
కోటప్పకొండ తిరునాళ్ల వస్తున్నాయంటే ఇప్పటికే కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షలు జరగాలి. మొత్తం మూడుసార్లు ఈ సమీక్షా సమావేశాలను నిర్వహిస్తారు. ఎంత బడ్జెట్ కేటాయించాలి? చేయాల్సిన పనులు ఏంటీ? అన్నదానిపై ఆలయ అధికారులతో పాటు, ఆర్‌అండ్‌బీ, విద్యుత్తు, పంచాయతీరాజ్, పోలీసు అధికారులతో ఈ సమావేశం జరుగుతుంది. అయితే ఇదీ ఇంతవరకూ జరగలేదు. తిరునాళ్లకు నెల కూడా లేదు. అయినా ప్రభుత్వ యంత్రాంగం పట్టనట్లు వ్యవహరిస్తోంది. రహదారులు సక్రమంగా ఉన్నాయా? ప్రభల ఊరేగింపు జరిగే దారులు ఎలా ఉన్నాయి? వంటి వాటిపై అధికారులు ఇంత వరకూ ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు చేయడం లేదు. రాజకీయ కారణాలతో స్థాయి ఉన్న అధికారులు వస్తే ఇలాంటివి క్రమపద్ధతిలో చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఏర్పాట్లు చేయాల్సిందిగా భక్తులు కోరుతున్నారు.
దుకాణాలకు టెండర్లు ఏవీ?
కోటప్పకొండ ఆలయం వద్ద సుమారు 20 వాణిజ్య దుకాణాలున్నాయి. అయితే ఏటా టెండర్లు పిలిచి వేలం పాటలో దక్కించుకున్న వాళ్లకు ఆయా దుకాణాలను కేటాయించాలి. కానీ ఈ ఏడాది అలా జరగలేదు. అసలు టెండర్లు కూడా పిలవకుండానే అధికార పార్టీకి చెందిన ఓ మండల ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో దుకాణాలను తన అనుచరులకు కట్టబెట్టినట్టు సమాచారం. ఏదో నామమాత్రపు ధరలు చెల్లించి ఆలయానికి రావాల్సిన ఆదాయానికి అధికార పార్టీ నేతలు గండికొట్టారు.
అమరావతికి ఎవరిని రానివ్వం
పంచారామాలలో ప్రథమ ఆరామంగా వెలుగొందుతున్న అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వర ఆలయ ఆదాయం రూ. మూడున్నర కోట్లు దాటింది. రూ. రెండు కోట్లు ఆదాయం దాటితేనే ఆలయం స్థాయి పెరుగుతుంది. పర్యవేక్షణకు అసిస్టెంట్ కమిషనర్(ఏసీ) స్థాయి అధికారిని నియమిస్తారు. అయితే ఇటీవల దేవాదాయశాఖ ఈ ఆలయం హోదా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ప్రభుత్వ ఆదేశాలు అమల్లోకి రాలేదు. ఏసీ స్థాయి అధికారి కార్యనిర్వహణాధికారిగా రావాల్సి ఉన్నా, ఇంత వరకు ప్రభుత్వం కేటాయించలేదు. గెజిట్ ఉత్తర్వులు వచ్చినా ఇంత వరకు ఏసీ స్థాయి అధికారి నియామకం జరగకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటి వరకు ఉన్న గ్రేడ్-1 అధికారే ఈవోగా కొనసాగుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పలు ఆలయాలతో పాటు అమరేశ్వరాలయానికి హోదా పెంచుతూ ఉత్తర్వులు వచ్చినా ఎందుకు అడ్డుకట్ట వేస్తున్నారనేది ప్రశ్నగా మిగిలింది. నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్య నేత అండదండలతో గుడికి చెందిన అధికారుల ఒత్తిడి మేరకు ఏసీ నియామకం జరగకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంతో ప్రాముఖ్యత కలిగిన దేవాలయానికి ఎన్నో ఏళ్ల తరువాత హోదా పెంచినా కొందరు కావాలనే తొక్కిపెట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హోదా కలిగిన అధికారి నియామకం జరిగేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయానికి హోదా ఉన్న అధికారి నియామకంపై దేవాదాయశాఖ ఉన్నతాధికారి సత్యనారాయణరెడ్డిని సంప్రదించగా అమరేశ్వరాలయానికి ఏసీ హోదా పెంచామన్నారు. పదోన్నతిపై ఏసీ స్థాయి అధికారి రావాల్సి ఉందని, వచ్చిన వెంటనే నియమిస్తామన్నారు.
Source : ఈనాడు