పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలతో పాటు క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్ నుంచి ఆచార్య ప్రమోద్ కృష్ణం వేటుకు గురయ్యారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అనంతరం ఆచార్య ప్రమోద్ కృష్ణం కాంగ్రెస్‌పై ఆదివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. తనను ఆరేండ్లకు బదులు 14 ఏండ్ల పాటు బహిష్కరించాల్సిందని, ఎందుకంటే రాముడు సైతం 14 ఏండ్లు వనవాసంలో ఉన్నారని ఆచార్య ప్రమోద్ కృష్ణం గుర్తుచేశారు.
తనను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ నుంచి బహిష్కరించినట్టు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. పార్టీ నుంచి తనకు విముక్తి కల్పించినందుకు ముందుగా కాంగ్రెస్ నాయకత్వానికి తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
తాను ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానని ముందుగా పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నారు. ”కాంగ్రెస్ పార్టీ పంపిన లేఖ విషయం మీడియా సంస్థల ద్వారా తెలిసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టు ఆలేఖలో కేసీ వేణుగోపాల్ చెప్పారు. పార్టీ నుంచి తనకు విముక్తి ప్రసాదించినందుకు మొదటగా కాంగ్రెస్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. దీనితో పాటు, పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేశానో చెప్పమని అడుగుతున్నాను?” అని కృష్ణం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
రాముడి పేరెత్తడం, అయోధ్యకు వెళ్లడం, ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాన్ని అంగీకరించడం, శ్రీ కల్కి థామ్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని కలవడం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు అవుతాయా? అని పార్టీ అధిష్ఠానాన్ని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పలు నిర్ణయాలతో తాను విభేదిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్ వ్యతిరేకించడం సరికాదని తేల్చి చెప్పారు.
డీఎంకే నేతలు సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చినప్పుడు కాంగ్రెస్ వారికి మద్దతుగా నిలిచిఉండాల్సింది కాదని స్పష్టం చేశారు. రాముడు, రాజ్యం గురించి తాను ఎలాంటి రాజీపడనని, ఇప్పుడు తాను స్వేచ్ఛా జీవినని ఆచార్య ప్రమోద్ కృష్ణం పేర్కొన్నారు. పార్టీలో తనకు పలు అవమానాలు జరిగినప్పటికీ బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీని వీడనని నాటి ప్రధాని రాజీవ్ గాంధీకి ఇచ్చిన మాటకు తాను కట్టుబడి ఉన్నట్టు ఆచార్య కృష్ణం తెలిపారు.
ఏళ్ల తరబడి తనకు కాంగ్రెస్‌తో అనుబంధం ఉందని చెబుతూ ఇప్పట్నించి దేశాభివృద్ధి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బాసటగా ఉంటానని వెల్లడించాయిరు. ఫిబ్రవరి 19న జరిగే శ్రీ కల్కి థామ్ ఫౌండేషన్ సెర్మనీకి ప్రధాని హాజరు కానుండటం తనకు గర్వంగా ఉందని, తన ఆహ్వానాన్ని మన్నించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సైతం కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు.