
స్వాతంత్ర్య సమరోద్యమ జ్యోతిగా వెలుగొందిన సింహపురి వీరవనిత… ఆదర్శ మహిళ పొణకా కనకమ్మ, పొణకా కనకమ్మ 10జూన్ 1892లో జన్మించింది. నెల్లూరు జిల్లాలోని మడమనూరు గ్రామానికి చెందిన కావమ్మ, మరుపూరు కొండారెడ్డి ఆమె తల్లిదండ్రులు. కనకమ్మకు తొమ్మిదో ఏడు రాగానే, ఆమె మేనమామ పొణకా సుబ్బరామిరెడ్డితో బాల్య వివాహం జరిగిపోయింది. పోట్లపూడిలో నూటయాభై ఎకరాలున్న భూస్వామి కుటుంబం వారిది. పాఠశాలలో ప్రాథమిక విద్య తప్ప హైస్కూలులో కానీ, కళాశాలలో కానీ కనకమ్మ చదువుకోలేదు. స్వయంకృషితో ఇంట్లోనే హిందీ, తెలుగు, సంస్కృత భాషలను అధ్యయనం చేసింది. ఆయా భాషల్లోని సాహిత్యంలో మంచి పరిచయాన్ని కలిగించుకొని ఉన్నది.
గాంధీజీ జాతీయోద్యమంలో ప్రవేశించకముందు, పోట్లపూడిలో 1910లోనే – జాతీయోద్యమాన్ని ప్రారంభించింది. అక్కడి వారిల్లు కవులు, పండితులకే కాకుండా జాతీయోద్యమ నాయకులకు కూడా విడిదిగా తయారైంది. 1904లో విదేశీ వస్తు బహిష్కరణలో భాగంగా ఆమె పోట్లపూడిలో అదే గ్రామానికి చెందిన నెల్లూరు వెంకటరామానాయుడుతో కలిసి చేనేత మగ్గాలను నెలకొల్పారు. ఆమంచర్ల ఆదినారాయణ చరఖాలు, మగ్గాలను అనేక ఇళ్లలో ప్రవేశపెట్టి ఖద్దరు వస్త్రాలను ఉత్పత్తి చేసి విక్రయించేవారు. ఆరోజుల్లోనే మహాత్మాగాంధీని నెల్లూరుజిల్లాకు తీసుకువచ్చి పల్లెపాడులో గాంధీ ఆశ్రమాన్ని ప్రారంభింపజేసింది. పల్లెపాడు ఆశ్రమం ఆ రోజుల్లో జాతీయోద్యమ నాయకులకు రహస్య స్థావరంగా కూడా ఉపయోగపడేది. పొణకా కనకమ్మ చేస్తున్న సేవలకు వారి ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. జాతీయోద్యమంకోసం అప్పులుచేశారు. భూములు అమ్మి అప్పులుతీర్చుకున్నారు. పోట్లపూడిని విడిచి బతుకుతెరువు కోసం వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నెల్లూరు జిల్లా జమీందారీ రైతు సంఘాన్ని పొణకా కనకమ్మ 1929 అక్టోబరు 19వ తేదీన స్థాపించింది. రైతులపై జమీందార్ల దౌర్జన్యాలు నశించాలని, రైతులను వెట్టిచాకిరీ నుంచి విముక్తి చేయాలని ఈ ఉద్యమం ముందుకు సాగింది. 1929వ సంవత్సరం డిసెంబర్ లో ఈ రైతుసంఘం మహాసభను నెల్లూరులో నిర్వహించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆ రోజు జస్టిస్ పార్టీ పాలన సాగుతున్నది. ఆచార్య ఎన్.జి. రంగా ఈ మహాసభకు హాజరయ్యారు. జమీందారీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని రంగా పెట్టిన తీర్మానాన్ని మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ మహాసభలోనే జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమానికి ఒక పత్రిక స్థాపించాలని తీర్మానించారు. ఈ తీర్మానాన్ని అనుసరించి ‘జమీన్ రైతు’ పత్రిక ప్రారంభమైంది.
విద్య, అజ్ఞానాంధకారంలో మగ్గుతున్న మహిళలకు స్త్రీవిద్య ద్వారా దారి చూపేందుకు కనకమ్మ 1923లో నెల్లూరు నడిబొడ్డున ఒక జాతీయ విద్యాలయాన్ని ప్రారంభించింది. 1929లో స్కూలు కోసం స్థలాన్ని కొనుగోలు చేశారు. భవన నిర్మాణానికి గాంధీ మహాత్ముడే స్వయంగా శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంలోనే స్కూలుకు కస్తూరిదేవి పేరు పెట్టారు. భవననిర్మాణ ప్రారంభసమయంలోనే కనకను మరోసారి అరెస్టయ్యారు. 1944 జూలై 16న ప్రస్తుతమున్న భవనంలో కస్తూరిదేవి విద్యాలయం ప్రారంభమయింది. కొంతకాలం తరువాత ఆమె అక్కడే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ స్కూలును ప్రారంభించారు. చేనేత అద్దకం, ఎంబ్రాయిడరీ, టీచర్ ట్రైనింగ్ లాంటి కోర్సులను ప్రారంభించారు. 1945లో స్కూలుకు అనుబంధంగా ఒక హాస్టలును కూడా కనకమ్మ ఏర్పాటు చేశారు.
ఆ హాస్టల్లో అన్ని కులాల బాలికలతో పాటు, ఎస్.సి బాలికలు కూడా ఉండేటట్లు ప్రత్యేక ప్రయత్నం చేసిన కారణంగా కుల వివక్ష, కులస్పృహలేకుండా ఆమె బాలికలందరూ కలసి చదువుకునే ఆదర్శ పద్ధతికి ఆమె శ్రీకారం చుట్టారు. 190 ఏప్రిల్ 11న మహాత్ముని పిలుపు మేరకు మైపాడు సముద్రతీరంలో జరిగిన ఉప సత్యాగ్రహంలో కనకమ్మ పాల్గొన్నారు. ఆమె ఓరుగంటి మహాలక్ష్మమ్మతో కలిసి తయారు చేశారు. కుండలలో సముద్రం నుంచి నీళ్ళు తెచ్చి పొయ్యిలు పెట్టి తయారు చేశారు. ఈ విధంగా తయారైన ఉప్పును పొట్లాలు కట్టి వైపాడు నెల్లూరులలో విక్రయించారు. ధీరులైన మగవారికి ఏమాత్రం తీసిపోని గుండె ధైర్యం ఆధిపత్యాన్ని సహించలేని తత్వం, ముందూ, వెనుకా చూడకుండా పోరాటా ముందుకురికే సాహసం పొణకా కనకమ్మ సొంతం. కనకమ్మ అంటే ఒకరి పేరు మాత్రం కాదనీ, ఒక సామూహిక శక్తికి ప్రతీక అని చాటి చెప్పారు. శ్రీమతి కనకమ్మ 15 సెప్టెంబరు 1963న తనువును చాలించారు.




