ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రనారీమణులు – 11 ; కోటమర్తి కనకమహాలక్ష్మి

216views

భారతీయ సమాజంమీద బ్రిటిష్ పాలన సమయంలో సృష్టించి ప్రచారం చేసినవన్నీ నిజమేనని నమ్మి, వాటిని ప్రచారం చేసుకుంటూ వచ్చారు వామపక్ష మేధావులు. స్త్రీలకు స్వాతంత్రం లేదు, వైధవ్యం కలిగిన మహిళలను హీనంగా చూసేవారు వంటి కట్టుకథలు ప్రచారం చేశారు. చైతన్యం పెరిగి స్వాతంత్ర సంగ్రామంలో దిగుతున్న మహిళలను కట్టడి చేసేందుకు నాడు బ్రిటిష్ వారు’ కట్టుకథలు అల్లితే, స్వాతంత్ర్యానంతరం ఆ కథలను చారిత్రకంగా తీర్చిదిద్దే బాధ్యత వామపక్ష చరిత్రకారులు తీసుకున్నారు. అది ఎంత అబద్దపు ప్రచారమో తెలియం చెప్తుంది కోటమర్తి కనకమహాలక్ష్మి జీవితం.

భీమవరంలోని గునుపూడి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వేలూరి కనకమహాలక్ష్మి ఐదేళ్ళ వయసుకే వివాహం, 30 ఏళ్ళ వయసుకి ఆరుగురు సంతానం, వైధవ్యం. తెల్లటి ఖాదీ పంచె ముసుగు ధరించి ఉండేవారు. పుట్టినింట, మెట్టినింట విన్న పురాణాలు, పండిత చర్చలు విని విని కనక మహాలక్ష్మికి శ్రుత పాండిత్యం అలవడింది. కనక మహాలక్ష్మికి గల వివేచన శక్తి, పాండితీ ప్రకర్ష, పురాణాలపై సంపాదించిన సాధికారత, మధురమైన గానం, ధర్మ బోధనతో ప్రజలను మెప్పించి ఎందరికో గురుతుల్యురాలు అయ్యింది.

సంఘ సంస్కరణపట్ల, భారత స్వతంత్ర ఉద్యమంపట్ల ఆసక్తి పెరిగిన కనక మహాలక్ష్మి జీవితకాలంలో ఉద్యమంలో నిమగ్నమైంది. నూలు తీస్తూ ఇంటింటా తిరిగి ఖద్దరు విక్రయించేది. హరిజనవాడలను దర్శించి వారి పిల్లలకు స్వయంగా స్థానాలు చేయించి శుభ్రత నేర్చేవారు. రోగులకు సపర్యలు చేసేవారు. రైలు ప్రయాణంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న హరిజన యువతిని ప్రక్క స్టేషన్లో దించి తాను కట్టుకున్న చీరనే ఆవరణగా ఏర్పాటు చేసి ఆ యువతికి స్వయంగా పురుడు పోసిన సామాజిక కార్యకర్త కనకమహాలక్ష్మి.

1930 జూన్ 10న పశ్చిమ గోదావరి జిల్లా శృంగవృక్షంలో సాయంత్రం వేళ స్వాతంత్ర్య ఉద్యమ బహిరంగ సభ జరుగుతోంది. గుమిగూడిన వేల మందిని ఉద్దేశించి, 50 ఏళ్ల వయసు పైబడిన ఒక బ్రాహ్మణ వితంతువు అనర్గళంగా ప్రసంగిస్తున్నది. పద్యాలతో శ్లోకాలతో రామాయణ, మహాభారతాలను ఉటంకిస్తూ, అర్ధయుక్తంగా ఉపమానాలను ఆశువుగా దొర్లిస్తూ, ఉప్పు సత్యాగ్రహంలో ప్రభుత్వం జరిపిన అరెస్టులను, ప్రభుత్వ దురాగతాలపైన, దౌర్జన్యాలపైన నిప్పులు చెరుగుతున్నది కోటమర్తి కనకమహాలక్ష్మి ప్రజలు మంత్ర ముగ్ధులై వింటున్నారు.

సరిగ్గా ఆ సమయంలో పోలీసు లారీ వచ్చింది. చుట్టుముట్టారు కనకమహాలక్ష్మి నెరవలేదు. మీరంతా భారతమాతను దాస్య విముక్తి చేయడానికి కంకణం కట్టుకున్న వీరులు. బ్రిటిష్ పోలీసులను చూసి బెదరకండి. వారు మన సోదరులే అని సభికులకు.. చెప్పి అయ్యా ఇన్స్పెక్టర్ గారు… మీ తుపాకీ గుండు గొప్పదో, నా బోడిగుండు గట్టిదో చూస్తారా అంటూ నెత్తిపైనున్న ముసుగు తీసి పోలీస్ ఇన్స్పెక్టర్ వైపు నడిచింది. సభ అంతా చప్పట్లు, కోటమర్తి కనకమహాలక్ష్మి సాహసానికి అంతా జేజేలు పలికారు. ఆమెను అరెస్ట్ చేసి తీసుకువెళుతుంటే తమ సొంత సోదరిని కోల్పోతున్న వారిలా మహాలక్షి రోదించారు. ఆమె సాహసానికి ఆంధ్రులు పొంగిపోతే, భీమవరం మెజిస్ట్రేట్ మాత్రం ఆమె ధిక్కారాన్ని సహించనని ఆరు నెలలు కారాగార శిక్ష విధించి వేలూరు జైలుకు పంపారు.

శిక్ష తర్వాత స్వాతంత్య్ర ఉద్యమ ప్రచార ప్రబోధకురాలుగా ఎంపికైంది. పగలు రాత్రి తేడా లేకుండా పశ్చిమగోదావరి జిల్లా అంతా తిరిగి ఉద్యమాలు నిర్వహించింది. ప్రజలు ఆమె ప్రసంగాలు విని ఉద్యమంలోకి దూకారు. మద్యపానానికి వ్యతిరేకంగా, విదేశీ వస్త్ర బహిష్కరణకు సానుకూలంగా, ఉప్పు శాసనాధిక్కారిణిగా కోటమర్తి -కమహా కనకమహాలక్ష్మి పేరు జిల్లా మొత్తం ప్రాకింది. ఆమె ప్రసంగాలు యువతను తిరిగి ఖట్టి రెచ్చగొడుతున్నాయి అనే ఆరోపణ చేసి కనకమహాలక్ష్మిని 1932లో అరెస్టు చేసి సంవత్సరం కారాగార శిక్ష విధించారు. తిరిగి 1941లో రెండవ ప్రపంచ యుద్ధ సమయ సత్యాగ్రహంలో అరెస్టు కాగా మరో ఆరు నెలలు శిక్ష విధించారు.

ఖైదీగా కనకమహాలక్ష్మీ అత్యంత ఉత్సాహంగా పాటలు, పద్యాలు పాడుతూ, భోజనాలు వడ్డిస్తూ సాటి ఖైదీలను క్రుంగుబాటుకు గురికాకుండా కాపాడేవారు. పురాణ ప్రవచనాలతో జైలు సిబ్బందిని కూడా ఆకట్టుకునేది ఆమె. తన కుటుంబం ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నా స్వాతంత్ర్యం వస్తే అన్ని సమస్యలు పరిష్కారంఅవుతాయనే నమ్మకంతో ఉద్యమంలో పాల్గొన్నది.

స్వాతంత్ర్యం వచ్చింది. కాని కోటమర్తి కనకమహాలక్ష్మీ వంటి త్యాగధనులు వెనుక పడిపోయారు. అవకాశవాదులు ముందు వరుసలో వచ్చి కూర్చున్నారు. అయినా ఆమెలో ఉద్యమస్ఫూర్తి నిలచేఉంది. ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ఉద్యమంలో భాగంగా ఏడు రోజులు నిరాహార దీక్ష చేసింది. వయసు మళ్ళినా ఢిల్లీకి ప్రధాని నెహ్రూని కలిసి ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుపై చర్చించింది.

స్వాతంత్రము నాటి వీరులను దేశం ఎంత త్వరగా మరిచిపోయిందో చెప్పలేం. 1962 వరకు జీవించి వున్నా ఆమె సంక్షేమం గురించి ఆలోచించినవారు, ఆమె త్యాగాన్ని గుర్తించిన వారు కఱవయ్యారు. కాని వారి గురించి ఎవరికి తెలియచెప్పరు. చరిత్రను రాసిన వీరు కొన్ని కుటుంబాల త్యాగఫలితమే స్వాతంత్య్రం అన్న రీతిలో ప్రవర్తించినందునే అసలు సిసలు వీరులు వెనుక పడిపోయారు. ఆంధ్రులు స్మరించుకోవల్సిన స్వాతంత్ర్యోద్యమ నారీమణుల్లో కోటమర్తి కనకమహాలక్షీ ఒకరు.