
ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) దిశగా ఉత్తరాఖండ్ భాజపా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆదివారం యూసీసీ తుది ముసాయిదా ప్రతిని ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. దీన్ని సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఇది ఆమోదం పొందితే, స్వాతంత్య్రానంతరం యూసీసీ అమలు చేయనున్న తొలి రాష్ట్రం.. ఉత్తరాఖండ్ కానుంది. గోవాలో పోర్చుగీసు పాలన నుంచి ఉమ్మడి పౌరస్మృతి ఉంది. 2022 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భాజపా తన ఎన్నికల మేనిఫెస్టోలో యూసీసీని ప్రముఖంగా పేర్కొంది. అధికారంలోకి రాగానే సీఎం పుష్కర్‌సింగ్ ధామి.. దీనిపై కమిటీ ఏర్పాటు చేశారు. రెండేళ్లు కసరత్తు చేసిన ఈ కమిటీ శుక్రవారం ముసాయిదా ప్రతిని సమర్పించింది. ఇది అమల్లోకి వస్తే. రాష్ట్రంలోని అన్ని మతాలకు ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి.





