News

మాల్దీవుల తీరంలో చైనా `గూఢచారి’ నౌకపై భారత్ అప్రమత్తం

216views

మాల్దీవుల అధ్యక్షుడిగా చైనా అనుకూల నేతగా పేరొందిన మొహమ్మద్ ముయిజ్జూ అధికారం చేపట్టిన్నప్పటి నుండి భారత్ తో దౌత్యపరమైన ఉద్రిక్తలు పెరుగుతున్న సమయంలో ఆ దేశపు తీరంలోని ప్రత్యేక ఆర్ధిక మండలి ప్రాంతంలో గూఢచర్యం, పరిశోధనల కోసమని భావిస్తున్న చైనా నౌక ఒకటి చేరడం ఆందోళన కలిగిస్తున్నది.

ఈ నౌక కదలికలను భారత్ నిశితంగా గమనిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. “మన ఆర్థిక, భద్రతా ప్రయోజనాలపై ప్రభావం చూపే పరిణామాలను మనం ఎల్లప్పుడూ నిశితంగా పరిశీలిస్తాము. అవసరమైనప్పుడు వాటిని రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాము” విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో తెలిపారు.

`మెరైన్ ట్రాఫిక్’ అనే ఓడల కదలికపై నిఘా ఉంచే ఓ ప్రైవేట్ వెబ్‌సైట్ అత్యంత అధునాతనమైన చైనా నౌక `జియాంగ్ యాంగ్ హాంగ్ 3′ ఫిబ్రవరి 8న మేల్ పోర్ట్‌లో డాక్ అయ్యే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా సంప్రదాయం ప్రకారం మాల్దీవుల కొత్త అధ్యక్షులు ఎవరైనా తమ తొలి అధికార పర్యటనగా న్యూఢిల్లీ సందర్శిస్తుంటారు.

కానీ, మొహమ్మద్ ముయిజ్జూ అధికారంలోకి వచ్చిన తర్వాత గత నెల ప్రారంభంలో మొదటగా బీజింగ్‌లో పర్యటించారు. దానితో భారతదేశం- మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో చైనా ఓడను ఆ దేశం అనుమతించడం కలకలం రేపుతోంది.

మంగళవారం ఒక ప్రకటనలో, తమ ఓడరేవులో తమ నౌకలో సిబ్బందిని మార్చుకునేందుకు, భర్తీ చేసుకొనేందుకు చైనా దౌత్యపరమైన అభ్యర్ధన చేసిన్నట్లు మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, చైనీస్ పరిశోధనా నౌక జియాంగ్ యాంగ్ హాంగ్ 3, “మాల్దీవుల జలాల్లో ఉన్నప్పుడు ఎటువంటి పరిశోధనలు నిర్వహించదు” అని ఆ ప్రకటన పేర్కొంది.

కాగా, బుధవారం, మాల్దీవుల మీడియా కధనం ఉద్రిక్తతను మరింతగా పెంచుతున్నది. ఎందుకంటే ఈ నౌక సాధారణ ట్రాకింగ్ సైట్‌లలో దేనిలోనూ కనిపించలేదని ఆ కధనం వెల్లడించింది. మాల్దీవుల స్థానిక దినపత్రిక, అధాధు కధనం ప్రకారం, ఈ ఓడ చివరిగా జావా సముద్రంలో ఇండోనేషియా తీరానికి సమీపంలో కనిపించింది.

“ఈ నౌక జనవరి నెల 22 నుండి పబ్లిక్ ట్రాకింగ్ సైట్‌లలో కనిపించడం లేదు. కొన్ని వాహనాల ట్రాకింగ్ సిస్టమ్‌లు స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నాయని భావిస్తున్నారు. ఆ రోజు చివరిగా చైనా నౌక ఇండోనేషియా వెలుపల జావా సముద్రంలో ఉన్నట్లు సైట్‌లు చూపిస్తున్నాయి.” అని ఆ కధనం తెలిపింది.

అధికారికంగా చైనా పైలట్ ఓషన్ లాబొరేటరీ తరపున సుదూర ప్రాంతంలో నీరు, లోతైన సముద్ర సర్వేలను ఆ నౌక నిర్వహిస్తున్నట్లు చైనా చెబుతున్నది. 2016లో నిర్మించిన ఈ నౌక చైనా ప్రారంభించిన సముద్ర పరిశోధన నౌకల సముదాయంలో భాగం.2019 నుండి శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే చైనా శాస్త్రీయ, సైనిక పరిశోధనల మధ్య రేఖలను అస్పష్టం చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
వాస్తవానికి ఆ నౌక శ్రీలంక తీరంలో ఉంచేందుకు ఆగేందుకు బయలుదేరింది. అయితే శ్రీలంక తీరంలో చైనా నౌకల సంచారం పెరుగుతూ ఉండడం పట్ల అమెరికా, భారత్ ఆందోళనలు వ్యక్తం చేస్తూ దౌత్యపరమైన వత్తిడులు తీసుకు రావడంతో తామ తీరంలో ఓ సంవత్సరం పాటు చైనా నౌకలపై మొరటోరియం విధించినట్లు శ్రీలంక స్పష్టం చేసింది. దానితో ఆ నౌకను మాల్దీవుల తీరంకు మళ్లించారని తెలుస్తున్నది.