
శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి ఈ ఏడాది పది రాకెట్ ప్రయోగాలు చేపట్టేలా లక్ష్యం నిర్దేశించామని షార్ సంచాలకుడు ఆర్ముగం రాజరాజన్ పేర్కొన్నారు. ‘వచ్చే నెల 17న జీఎస్ఎల్వీ-ఎఫ్14 వాహకనౌకను రెండో ప్రయోగ వేదిక నుంచి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దీని ద్వారా అధునాతన ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నాం. జీఎస్ ఎల్వీ-ఎఫ్14తో ఉపగ్రహ అనుసంధానం సజా హవుగా జరుగుతుంది. ఈ అధునాతన ఉపగ్ర హాలు మెరుగైన కవరేజీ, బ్యాండ్విడ్ను అందిస్తాయి. టెలికమ్యూనికేషన్స్, గ్రామీణ అనుసంధానం, విపత్తు నిర్వహణతో సహా వివిధ రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ఏడాదిలో జీఎస్ఎల్వీ ప్రయోగంతో పాటు పీఎస్ఎల్ వీ, ఎస్ఎస్ఎల్పీ, మానవ రహిత గగన్యాన్ ప్రయోగాలు ఉంటాయి.
షార్లో ప్రైవేట్ స్టార్టప్ లకు సంబంధించి అగ్నికుల్ కు చెందిన ప్రైవేటు ప్రయోగ వేదిక, రాకెట్ సిద్ధం చేశాం. త్వరలో ప్రయోగిస్తాం. దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. స్కైరూట్కు చెందిన ప్రైవేట్ రాకెట్ ప్రయోగాలూ చేప డతాం. తమిళనాడులోని కులశేఖర పట్టణంలో చిన్న ఉపగ్రహ వాహకనౌకల ప్రయోగ వేదిక పనులు ప్రారంభమయ్యాయి. 2025 సెప్టెంబరు నాటికి పూర్తిచేయాలనేది మా లక్ష్యం. శ్రీహరికో టలోనూ మూడో ప్రయోగ వేదిక ఏర్పాటుకు అధ్యయనం చేసి ప్రస్తుతం డిజైన్లు రూపొం దించాం’ అని వెల్లడించారు. ఆయన వెంట ఎంఎంజీ గ్రూపు డైరెక్టర్ గోపీకృష్ణ ఉన్నారు.





