
వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలుచేస్తామని కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి శాంతనూ ఠాకూర్ నేడు వ్యాఖ్యానించారు. ఆయన పశ్చిమబెంగాల్‌లో దక్షిణ 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీప్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘కేవలం మన రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా రానున్న వారం రోజుల్లో సీఏఏ అమల్లోకి వస్తుందని నేను హామీ ఇస్తున్నా. ముఖ్యమంత్రి మాత్రం 1971 తర్వాత భారత్‌కు వచ్చినవారు, ఆధార్‌కార్డులు, ఓటర్ ఐడీలు ఉన్నవారు దేశ పౌరులే అని చెబుతున్నారు. 1971 తర్వాత వలస వచ్చినవారి జీవితాలు బాగుపడటానికి పౌరసత్వం ఉపయోగపడుతుంది. అందుకే సీఏఏను తీసుకొచ్చింది’’ అని పేర్కొన్నారు. ఆయన పశ్చిమబెంగాల్‌లోని బంగాన్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ మతువా తెగ ప్రజలు ఎక్కువగా ఉంటారు.
నవంబర్‌లో కోల్‌కతాలో జరిగిన ఓ సభలో సీఏఏను అమలుచేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార ప్రారంభ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బుజ్జగింపు రాజకీయాలు, సరిహద్దు చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింస వంటి జాడ్యాలతో రాష్ట్రాన్ని నాశనం చేశారని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విమర్శించారు. తాజాగా అమిత్‌షా వ్యాఖ్యలను శాంతనూ పునరుద్ఘాటించారు.





