
ఏలూరు జిల్లా తిమ్మాపురంలో కనకదుర్గమ్మ పీఠాన్ని ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్ ఎదుట విశ్వహిందూ పరిషత్తు సభ్యులు బుధవారం ఆందోళన చేశారు. వారు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మాపురం శివారులో తోట గంగాధర్ అనే వ్యక్తి ఆరేళ్ల కిందట అమ్మవారి పీఠం ఏర్పాటుచేసి పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడికి వచ్చే భక్తులకు అన్నదానం నిర్వహిస్తున్నారు.
అయితే పీఠానికి వచ్చే భక్తులకు రూ.200 టికెట్ పెట్టాలని, వాటిలో రూ.100 తమకివ్వాలని చుట్టుపక్కల పొలాలున్న అయిదుగురు రైతులు గంగాధర్‌పై ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. అందుకు అంగీకరించకపోవడంతో అతడిపై దాడి చేసి అక్కడి నుంచి పంపేశారు. అనంతరం పీఠాన్ని కూల్చి, విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనిపై బాధితుడు విశ్వహిందూ పరిషత్తు సభ్యులతో కలిసి ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, హోం మంత్రి తానేటి వనిత తమ వెనుక ఉన్నారని నిందితులు బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో న్యాయం చేయాలంటూ విశ్వహిందూ పరిషత్తు సభ్యులు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.





