News

నూతక్కిలో 3 రోజుల పాటు ఆరెస్సెస్ ప్రాంత ప్రచారక్ ల సమావేశాలు

325views

విజయవాడ సమీపంలోని నూతక్కిలో 3 రోజుల పాటు ఆరెస్సెస్ ప్రాంత ప్రచారకుల సమావేశాలు జరుగనున్నట్టు ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత సంఘచాలాక్ శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు తెలిపారు. ఈ నెల 11, 12, 13 తేదీలలో గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, నూతక్కిలోని విజ్ఞాన విహార రెసిడెన్షియల్ పాఠశాల నందు జరిగే ఈ సమావేశాలలో సంఘ పరంగా దేశం మొత్తంలో ఉన్న 44 ప్రాంతాల నుంచి ప్రాంత ప్రచారక్ లు, సహ ప్రాంత ప్రచారక్ లు, క్షేత్ర ప్రచారకుల తోపాటు అఖిల భారతీయ కార్యకారిణి కూడా ఈ సమావేశాలలో పాల్గొననున్నట్టు ప్రకటనలో ఆయన తెలిపారు. వీరితోపాటుగా కొందరు వివిధ క్షేత్ర సంఘటనా మంత్రులతో  కలిపి మొత్తం షుమారు 200 మంది ఈ సమావేశాలలో పాల్గొననున్నట్లు వారు తెలిపారు.

ప్రాంత ప్రచారకుల సమావేశాలు ప్రతి ఏడాది జులై నెలలో దేశంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించుకుంటూ ఉంటామని, గత సంవత్సరం గుజరాత్ లోని సోమనాథ్ లో ఈ సమావేశాలు జరిగాయని ఆయన తెలిపారు.

ఇది నిర్ణాయక జట్టు సమావేశం కాదని, ప్రతి ఏడాది అక్టోబర్ నెలలో జరిగే అఖిల భారత కార్యకారీ మండల్ లోనూ మరియు మార్చి నెలలో జరిగే ప్రతినిధి సభలలోనూ  వివిధ విషయాలపై చర్చ మరియు తీర్మానాలు ఉంటాయని, ఈ సమావేశాలలో ఎలాంటి తీర్మానాలు చెయ్యబడవని, ఇది సంస్థాగతమైన సమీక్షకు ఉద్దేశించిన సమావేశం మాత్రమేనని వివరించారు.

ఈ సమావేశాలలో ప్రధానంగా రెండు విషయాలపై చర్చించడం జరుగుతుందన్నారు.

1)ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 80 పైచిలుకు ప్రదేశాలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క 20 రోజుల వేసవి శిక్షణా తరగతులు నిర్వహించబడ్డాయని, 20,000 మందికి పైగా స్వయంసేవకులు ఈ శిక్షణా తరగతులలో పాల్గొన్నారని తెలిపారు. ఈ శిక్షావర్గలలో పరిశీలనకు వచ్చిన వివిధ అంశాల తోపాటు వర్గలలో వచ్చిన వివిధ అనుభవాలు, వర్గలలో అనుసరించవలసిన నూతన విధానాలపై ఈ సమావేశాలలో ప్రధానంగా చర్చలు జరుగుతాయన్నారు.

2)ఈ ఏడాది అఖిల భారతీయ అధికారుల పర్యటన ప్రణాళిక కూడా ఈ సమావేశాలలో నిర్ణయమౌతుందని తెలిపారు.

సామాజిక పరివర్తన కోసం స్వయంసేవకులు వివిధ రంగాలలో పని చేస్తున్నారని, సంఘంలో వాటిని “గతివిధులు” అని పిలుచుకుంటామని వివరించారు. అవి గ్రామీణ వికాసం, సామాజిక సమరసత, గో సంవర్ధన, సామాజిక సద్భావన అని తెలిపారు. వీటితో పాటు “పర్యావరణ పరిరక్షణ” అనే గతి విధిని కూడా క్రొత్తగా ప్రారంభించుకున్నామన్నారు.

2019  జూలై 11 వ తారీఖు గురువారం ఉదయం నుంచి, 13 శనివారం సాయంత్రం వరకు ఈ సమావేశాలు జరుగుతాయని శ్రీ శ్రీనివాసరాజు తెలిపారు.