
రామమందిర నిర్మాణం కోసం ప్రారంభించిన రామజన్మభూమి ఉద్యమం కుహనా లౌకికవాదుల దాడి నడుమ లౌకికవాదానికి అసలైన నిర్వచనం తిరిగి పొందేందుకు ఓ చిహ్నంగా నిలించిందని బీజేపీ దిగ్గజ నేత ఎల్‌కే అద్వానీ (96) అభిప్రాయపడ్డారు. ‘శ్రీరామ మందిరం : నెరవేరిన దివ్య కల’ పేరుతో ఆయన రాసిన వ్యాసంలోని మరికొంత సమాచారాన్ని అద్వానీ కార్యాలయం విడుదల చేసింది. ఈ ఉద్యమం సందర్భంగానే నికార్సైన లౌకికవాదం, కుహనా లౌకికవాదాల నడుమ తేడాలపై దేశమంతా ఓ ప్రత్యేకమైన చర్చ ప్రారంభమైందని ఆయన తెలిపారు. ‘‘1990లో రామమందిర నిర్మాణం కోసం మేం రథయాత్ర ప్రారంభించినపుడు ప్రజల మద్దతు పుష్కలంగా లభించగా, చాలా రాజకీయ పార్టీలు మా వెంట నడిచేందుకు జంకాయి. ముస్లిం ఓట్లు పోతాయని వారి భయం. ఓటు బ్యాంకు రాజకీయాలకు లొంగిపోయి సెక్యులరిజం పేరుతో వారు తమ వైఖరిని సమర్థించుకున్నారు’’ అన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని కళ్లారా చూడటంతో తన జన్మ ధన్యమైందని.. భారత పౌరుడిగా గర్వపడుతున్నానని చెప్పారు. ‘‘అయోధ్య భూవివాదంపై కోర్టులో సుదీర్ఘ న్యాయపోరాటం జరుగుతున్నపుడు నాతోపాటు బీజేపీ, సంఘ్ పరివార్‌లోని ప్రతి సభ్యుడు రామ్‌లల్లాను న్యాయమైన స్థానంలో ప్రతిష్ఠించాలనే కల సాకారమయ్యే దిశగా భారతీయుల ఆత్మను మేల్కొలిపేందుకు కృషి చేస్తూ వచ్చాం. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాత్మక తీర్పుతో ప్రశాంత వాతావరణంలో రామమందిర పునర్నిర్మాణం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.
ఆ ఇద్దరినీ మిస్సవుతున్నా..
ఈ శుభ తరుణంలో ఇద్దరు వ్యక్తుల లోటు తనకు బాగా కనిపిస్తోందని ఆడ్వాణీ చెప్పారు. ఒకరు తన భార్య కమల కాగా, మరొకరు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిగా పేర్కొన్నారు. ‘‘వాజ్‌పేయీ నా రాజకీయ, వ్యక్తిగత జీవితంలో అంతర్భాగం. ఇక రెండో వ్యక్తి నా భార్య దివంగత కమల. ప్రజాజీవితంలో సుదీర్ఘమైన నా ప్రస్థానానికి ఆమె స్థిరత్వం, అసమాన బలాన్ని చేకూర్చింది’’ అని అద్వానీ గుర్తుచేసుకున్నారు.





