
పశ్చిమ బెంగాల్‌లో గంగాసాగర్ మేళాకు బయల్దేరిన ముగ్గురు సాధువులను స్థానికులు చితకబాదడంపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి అని భాజపా ఆరోపించింది. ‘‘గంగాసాగర్‌కు వెళ్తున్న సాధువులను దారుణంగా కొట్టారు. అధికార టీఎంసీ పార్టీ మద్దతుతో కొందరు ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనంగా ఉండటం సిగ్గుచేటు’’ అని దుయ్యబట్టింది. మరోవైపు ఈ ఘటనకు మతం రంగు పులమాలని భాజపా భావిస్తోందని తృణమూల్ ప్రత్యారోపణ చేసింది. ఈ నెల 11న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు సాధువులు పురూలియా జిల్లాలో వాహనం ఆపి ముగ్గురు అమ్మాయిలను దారి అడిగారు. సాధువులు అడిగేది అర్థంకాక ఆ అమ్మాయిలు భయపడుతూ పారిపోయారు. దీనిని తప్పుగా అర్థం చేసుకున్న స్థానికులు వారిని కిడ్నాపర్లుగా పొరబడి దాడి చేశారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు. సాధువులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. వారు కిడ్నాపర్లు కాదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు.. దాడికి పాల్పడిన 12 మందిని అరెస్టుచేశారు.





