
అయోధ్య రాముడి విగ్రహం బరువు సుమారు ఒకటిన్నర టన్నులు ఉంటుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. కర్ణాటక, రాజస్థాన్‌కు చెందిన కళాకారులు నల్లటి ఏకశిలతో 51 అంగుళాల మేర రూపొందించిన మూడు విగ్రహాల్లో ఒకదాని ఎంపిక పూర్తి కావచ్చిందన్నారు. మిగతా రెండు విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఇతర చోట్ల ప్రతిష్ఠించనున్నట్లు చంపత్‌రాయ్ చెప్పారు.
‘‘రాముడి విగ్రహం అయిదేళ్ల బాలుడి రూపంలో ఉంటుంది. కళ్లు, నవ్వు, శరీరాకృతి, ముఖం ఇలా ప్రతి అంశంలోనూ దైవత్వం ఉట్టిపడేలా జాగ్రత్తలు తీసుకున్నాం. విష్ణు అవతారంగా, ఓ రాజకుమారుడిగా రాముడు ఉంటాడు’’ అన్నారు. మహర్షులు వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్యులతోపాటు నిషాద్‌రాజ్, మాతా శబరి, అహల్య ఆలయాలను ప్రాంగణం లోపల నిర్మిస్తామని, ప్రహరీ బయట మరో ఏడు గుడులను కడతామని వివరించారు. ప్రాణప్రతిష్ఠ పూజలు జనవరి 16 నుంచే ప్రారంభం కానున్నాయి. ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12.00 గంటలకు రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు చేశామని, ఇందుకోసం భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు సహకరించినట్లు చంపత్ రాయ్ తెలిపారు.





