News

సమస్యలన్నింటికీ ‘గీత’లోనే పరిష్కారం : అమిత్ షా

203views

సమాజంలో ఉన్న అన్ని సమస్యలకూ భగవద్గీతలో పరిష్కారం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. అందుకే గీతాసారం దేశం నలుమూలలతో పాటు ప్రపంచవ్యాప్తం కావాలని ఆయన ఆకాంక్షించారు. హరియాణాలోని కురుక్షేత్రలో నిర్వహించిన అంతర్జాతీయ గీతా మహోత్సవంలో భాగంగా నిర్వహించిన సంత్‌ సమ్మేళన్‌లో అమిత్‌ షా పాల్గొని మాట్లాడారు.

75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత ఎందరో మహాత్ములు, సాధువులు భగవద్గీత నుంచి జ్ఞానాన్ని సముపార్జించారని అమిత్‌ షా చెప్పారు. సమాజం, దేశంలోనే కాదు.. ప్రపంచంలో ఉన్న అన్ని సమస్యలకూ భగవద్గీతలో సమాధానం దొరుకుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు విద్యావంతులను తాను కలిసినప్పుడు వారూ ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. ప్రస్తుతం మనమందరం కూర్చున్న ఇదే చోట (కురుక్షేత్రను ఉద్దేశిస్తూ) 5 వేల ఏళ్ల క్రితం అర్జునుడికి కృష్ణుడు గీతను బోధించాడని గుర్తు చేశారు. చిన్నతనంలో తన తల్లి గీత బోధించారని చెప్పారు. అందుకే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినప్పటికీ.. ఆ బాధ, నిరాశలను అనుభవించలేదని చెప్పారు.