News

ఆగస్టు 15 ఎంత ముఖ్యమైందో, ఆ తేదీ కూడా అంతే : రామ మందిరం ట్రస్టు చీఫ్‌

305views

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. 2024 జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠతో ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ వేడుకకు సంబంధించి రామ మందిరం ట్రస్ట్‌ ఇప్పటికే పలువురు ప్రముఖులుకు ఆహ్వానాలు అందజేసింది. మరోవైపు 2024 జనవరి 22వ తేదీపై శ్రీరామ్‌ జన్మభూమి ట్రస్ట్‌ జనరల్‌ సెక్రటరీ చంపత్‌రాయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామమందిర ఆలయ ప్రారంభ తేదీని చంపత్‌రాయ్‌ భారత స్వాతంత్య్రం సిద్ధించిన ఆగస్టు 15తో పోల్చారు. ఈ మేరకు ఈ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు.

‘‘మనకు స్వాతంత్య్రం సిద్ధించిన 1947 ఆగస్టు 15వ తేదీ ఎంత ముఖ్యమైందో 2024 జనవరి 22వ తేదీ కూడా అంతే ముఖ్యమైంది. కార్గిల్‌ను తిరిగి పొందడం ఎంత ముఖ్యమైందో, 1971లో లక్షమంది శత్రు సైనికులను నిర్భందించడం కూడా అంతే ముఖ్యమైంది’’ అని చంపత్‌ రాయ్‌ అన్నారు. భారత్‌ను ఏకం చేసే విధంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్నందుకు అయోధ్య ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతోందన్నారు. ‘‘అయోధ్యతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన వారు, పూజారులు, గురువులు, దేశవ్యాప్తంగా ఉన్న సాధువులు 1983 తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకమయ్యేందుకు అంతా సిద్ధమవుతున్నారు. అయోధ్యకు పరిమితమైన అంశం ఇప్పుడు దేశం మొత్తం గర్వించే అంశమైంది. ఈ భావన ఎంతో అనుభూతి కలిగిస్తోంది అని ఆయన అన్నారు.