
మధ్యప్రదేశ్ బైతూల్‌కు చెందిన రవీంద్ర గుప్తా అలియాస్ భోజ్‌పలి బాబా అనే సాధువును అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానించింది ఆలయ ట్రస్ట్. 56 ఏళ్ల రవీంద్ర గుప్తా రాముడికి పరమ భక్తుడు. అయోధ్యలో రామాలయం నిర్మించేవరకు వివాహం చేసుకోనని 1992 డిసెంబర్ 6న శపథం చేసి, అలా ఒంటరిగానే ఉండిపోయారు.

“రామ్‌లల్లాను చిన్నపాటి చెక్క సింహాసనంపై శ్రీరామ్ పిరామల్ దాస్ ఉంచడాన్ని చూశాం. మన దేశంలో రాముడికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా అనిపించింది. రాముడికి భారీ ఆలయం కట్టే వరకు పెళ్లి చేసుకోనని, హిందూ సంస్థల కోసం పని చేస్తానని నేను అప్పుడు శపథం చేశాను.”
–రవీంద్ర గుప్తా, రామ భక్తుడు
అయోధ్య రామాలయం కర సేవకుల్లో రవీంద్ర ఒకరు. విశ్వహిందూ పరిషత్‌లో సభ్యునిగానూ ఉన్నారు. “రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో రవీంద్ర క్రియాశీల సభ్యుడు. వీహెచ్‌పీకి అనేక చోట్ల ప్రాంతీయ సారథిగా ఉన్నారు. బైతూల్‌లో వీహెచ్‌పీ సారథి అయినప్పుడు మేము భోజ్‌పలి బాబాను కలిశాము.”
–కృష్ణకాంత్ గవండే, స్థానిక కార్యకర్త
అయోధ్య ట్రస్ట్ ఆహ్వానంపై రవీంద్ర సంతోషంగా ఉన్నారు. దీనిని భగవంతుని ఆశీర్వాదంగా చూస్తున్నారు. “అయోధ్య రామాలయానికి రావాలని నన్ను శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహత్ కార్యంలో నేను భాగస్వామిని అవుతానని ఊహించలేదు. కానీ భోపాల్‌కు చెందిన ఓ చిరు న్యాయవాదికి, సాధువులా ప్రపంచమంతా తిరిగే ఓ వ్యక్తికి ఆహ్వానం అందేలా ఆ భగవంతుడే చేశాడు” అని రవీంద్ర గుప్తా వివరించారు.
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ పూర్తయినా తాను పెళ్లి చేసుకోనని చెప్పారు రవీంద్ర. తనకు వయసు పైబడిందని, రాముడికే అంకితమై జీవితాన్ని కొనసాగిస్తానని తెలిపారు.





