
ఆర్థిక వృద్ధి విషయంలో భారత్‌ను పదేపదే చైనాతో పోల్చడాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వ్యతిరేకించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. మన పొరుగున ఉన్న చైనా ప్రజాస్వామ్య దేశం కాదని, అక్కడ నియంతృత్వ పాలన ఉందని విమర్శించారు. ఈ సందర్భంగా దేశంలో నిరుద్యోగం, అవినీతి, పాలనాపరమైన అడ్డంకులు, నైపుణ్యాల అంతరం ఉందంటూ వ్యక్తమవుతున్న ఆందోళనలను కూడా ప్రధాని తోసిపుచ్చారు.
‘‘ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడేటప్పుడు భారత్‌ను చైనాతో పోల్చడం సరికాదు. దిల్లీని ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే మరింత సముచితంగా ఉంటుంది. ఎందుకంటే మా పొరుగు దేశంలో ప్రజాస్వామ్య పాలన లేదు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇక, అవినీతి, నిరుద్యోగం వంటి సవాళ్లే ఉంటే.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు సాధించేది కాదని అన్నారు.
‘‘ప్రపంచ స్థాయి కంపెనీల్లో భారత సంతతి వ్యక్తులు సీఈవో హోదాల్లో ఉన్నారు. భారత్‌లో నైపుణ్యాల అంతరం లేదని చెప్పేందుకు ఇదే సరైన ఉదాహరణ’’ అని మోదీ తెలిపారు. విదేశీ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తోందని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు. తద్వారా ప్రపంచ స్థాయి కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇదే ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ పలు కీలక అంశాల గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. భారత్‌లో మైనార్టీలను అణచివేస్తున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ‘‘వివిధ రకాల వేదికలపై విమర్శకులు(విపక్షాలు) తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తారు. అలాంటప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పి.. వాటిని ఖండించే హక్కు అవతలి పక్షానికి ఉంటుంది’’ అని మోదీ తెలిపారు.





