News

మథుర షాహీ ఈద్గా సర్వే ఆదేశాల నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరణ

363views

మథురలోని కృష్ణ జన్మభూమి ఆలయం చెంతనున్న షాహీ ఈద్గా సర్వేకు అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు మసీదు కమిటీ తరఫు నుంచి వచ్చిన మౌఖిక అభ్యర్థనను జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌.వి.ఎన్‌.భట్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనం శుక్రవారం తోసిపుచ్చింది. అయితే, అప్పీలు ద్వారా పిటిషనర్లు హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేయవచ్చని తెలిపింది.

న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో సర్వే నిర్వహించేందుకు, దాని పర్యవేక్షణకు గాను అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించేందుకు అలహాబాద్‌ హైకోర్టు గురువారం అనుమతించిన విషయం తెలిసిందే. శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం, మసీదు వివాదానికి సంబంధించి మథుర కోర్టులో పెండింగులో ఉన్న అన్ని వివాదాలను హైకోర్టు మే 26న తన వద్దకు బదిలీచేసుకోవడాన్ని సవాలు చేసిన కేసు విచారణను జనవరి 9వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ఆ రోజున వివాదానికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తామని వెల్లడించింది.