
భవిష్యత్‌తరం మానవరహిత పోరాట విమానాలను రూపొందించే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన హైస్పీడ్ ఫ్లయింగ్ వింగ్ మానవరహిత విమానా (యూఏవీ)న్ని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ మంత్రిత్వశాఖ శుక్రవారం తెలిపింది. దీంతో ఈ తరహా సంక్లిష్ట పరిజ్ఞానం కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత చేరినట్లయింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఈ పరీక్ష జరిగింది. ఈ అటానమస్ లోహవిహంగాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రూపొందించింది. ఇది బాణం మొన ఆకృతిలో ఉంటుంది. దీనికి తోక భాగం ఉండదు. నేల మీద నుంచి రాడార్లు, మౌలిక వసతులు, పైలట్ సాయం లేకుండా ఈ యూఏవీ సొంతంగా ల్యాండింగ్ నిర్వహించగలిగింది. దీని సెన్సర్ డేటాను స్వదేశీ ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ రిసీవర్లతో అనుసంధానించడం వల్ల ఇది సాధ్యమైంది. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించిన డీఆర్‌డీవో, సైనికదళాలు, ప్రైవేటు పరిశ్రమలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అభినందించారు.





