News

సరైన సమయంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర ప్రతిపత్తి

206views

జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తిని తగిన సమయంలో కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పారు. ప్రధాని నేతృత్వంలో సరికొత్త, అభివృద్ధి చెందిన కశ్మీర్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లయిందన్నారు. జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లును, జమ్మూకశ్మీర్‌ రిజర్వేషన్‌ (సవరణ) బిల్లును రాజ్యసభ సోమవారం దాదాపు నాలుగు గంటల చర్చ తర్వాత ఆమోదించింది. ఈ రెండింటినీ లోక్‌సభ గత వారమే ఆమోదించింది. కశ్మీరీ శరణార్థుల నుంచి ఇద్దరిని, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నిర్వాసితుల నుంచి ఒకరిని శాసనసభకు నామినేట్‌ చేసేందుకు, కొన్ని వర్గాలకు రిజర్వేషన్‌ ఇచ్చేందుకు ఈ బిల్లులు వీలు కల్పిస్తాయి. జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పిస్తూ వచ్చిన 370వ అధికరణాన్ని రద్దుచేయడం సబబేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునూ ఆయన ప్రస్తావించారు. ఈ అధికరణ శాశ్వతమైనదని ఎవరైనా అంటే వారు భారత రాజ్యాంగాన్ని, పార్లమెంటును అవమానించినట్లేనని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమైనదని, జమ్మూకశ్మీర్‌ రాజ్యాంగానికి ఇకపై ఎలాంటి విలువ ఉండబోదని చెప్పారు. ఇక యావద్దేశానికి ఒకే జెండా, ఒకే రాజ్యాంగం ఉంటాయన్నారు.

పీవోకేలో అంగుళమైనా వదులుకోం

‘‘370 అధికరణం జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదానికి దారితీసింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌.. భారత్‌లో భాగం. అంగుళం భూభాగాన్ని కూడా కోల్పోయే ప్రసక్తే లేదు. అందుకు భారత్ ఎప్పటికీ సిద్ధంగా ఉండదు’’ అని అమిత్‌ షా స్పష్టీకరించారు. కేవలం ఒకేవ్యక్తి పొరపాటు వల్ల భారత్‌లో జమ్మూకశ్మీర్‌ భాగం కావడం ఆలస్యమైందని అన్నారు. కొత్త బిల్లుల వల్ల పీవోకే నుంచి 24 మందికి శాసనసభలో సీట్ల రిజర్వేషన్‌ ఉంటుందని చెప్పారు. ఉరీ, పుల్వామా సెక్టార్లలో మారణహోమం సృష్టించినవారిని, వాళ్ల ఇంటికి వెళ్లిమరీ హతమార్చామంటూ సర్జికల్‌ స్రైక్స్‌ను గుర్తుచేశారు. అమిత్‌షా సమాధానం మధ్యలోనే విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.