News

17 నుంచి తిరుమలలో తిరుప్పావై పారాయణం

233views

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17 నుంచి 2024 జనవరి 14 వరకు పెద్ద జీయ్యంగార్‌ స్వామి మఠంలో తిరుప్పావై పారాయణం చేపట్టనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న పెరియకోయిల్‌ కేల్వి అప్పన్‌ శ్రీ శఠగోప రామానుజ పెద్దజీయంగార్‌స్వామి మఠంలో నెల రోజులు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు తిరుప్పావై పాశురాలను పారాయణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన భగవత్‌ రామానుజాచార్యుల కాలంలో తిరుమలలో పెద్ద జీయంగార్‌ మఠం ఏర్పాటైంది. శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీ రామానుజాచార్యులు ప్రవేశపెట్టిన కైంకర్యాలు, క్రతువులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రామానుజాచార్యుల పరంపరలో వస్తున్న జీయంగార్‌ స్వాములు తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలు, సేవలు, ఉత్సవాలను పర్యవేక్షిస్తున్నారు.