News

ఖలిస్థానీల లక్ష్యంగా ‘సీక్రెట్‌ మెమో’ వార్తలను తీవ్రంగా ఖండించిన భారత్‌

306views

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్ హత్యతో భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికాకు చెందిన ఆన్‌లైన్‌ మీడియా సంస్థ ‘ది ఇంటర్‌సెప్ట్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో న్యూఢిల్లీ పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. పశ్చిమ దేశాల్లో ఆశ్రయం పొందుతున్న కొన్ని సిక్కు సంస్థలను అణచివేసేలా భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోపించింది.

‘‘ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉత్తర అమెరికాలోని తమ ఎంబసీలకు భారత విదేశాంగ శాఖ ఓ ‘సీక్రెట్‌ మెమో ’ జారీ చేసింది. అందులో భారత నిఘా సంస్థలు దర్యాప్తు చేస్తున్న పలువురు ఖలిస్థానీ ఉగ్రవాదుల జాబితా ఉంది. ఆ సిక్కు వేర్పాటువాదులను అణచివేసేలా కఠిన చర్యలు తీసుకోవాలని అందులో ఆదేశాలిచ్చింది’’ అని ఆ కథనంలో పేర్కొంది. దీంతో ఇది కాస్తా తీవ్ర దుమారం రేపింది.

కాగా.. ఈ కథనాన్ని భారత విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చి దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఇలాంటి నివేదికలు అవాస్తవమని, అవన్నీ పూర్తిగా కల్పిత కథనాలని మేం గట్టిగా నొక్కి చెబుతున్నాం. ఎలాంటి సీక్రెట్ మెమోను దిల్లీ జారీ చేయలేదు. ఇది భారత్‌కు వ్యతిరేకంగా సాగుతున్న తప్పుడు ప్రచారంలో భాగమే. ఈ కథనాన్ని ప్రచురించిన అవుట్‌లెట్‌.. పాక్‌ ఇంటెలిజెన్స్‌ ప్రోద్బలంతో నకిలీ వార్తలను ప్రచారం చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. తమ విశ్వసనీయతను పణంగా పెట్టి మరీ కొందరు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తుంటారు’’ అని విదేశాంగ శాఖ తీవ్రంగా దుయ్యబట్టింది.