
సిల్కియారా టన్నెల్ నుంచి 41 మంది కార్మికుల్ని రక్షించారు. అయితే 17 రోజుల తర్వాత ఆ వర్కర్లు బయటకు వచ్చారు. రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్న సమయంలో ఆ సైట్ వద్ద పాక్షికంగా ఓ గుడిని నిర్మించారు. ఆ ఆలయం వద్ద ఇంటర్నేషనల్ టన్నెలింగ్ నిపుణుడు అర్నాల్డ్ డిక్స్ పూజలు చేశారు. కార్మికుల్ని రక్షించేందుకు వచ్చిన అమెరికా నిపుణుడు ఆ గుడి వద్ద పూజలు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కార్మికుల్ని రక్షించిన తర్వాత ఇవాళ అర్నాల్డ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ గుడి వద్ద దేవుడికి థ్యాంక్స్ చెప్పాలన్నారు. వర్కర్లను రక్షించడం ఓ అద్భుతమని పేర్కొన్నాడు.
టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానని, ఒక తండ్రిగా పిల్లల్ని రక్షించడం తన బాధ్యత అని, ఒక బృందంగా అద్భుతంగా పనిచేశామని, సక్సెస్‌ఫుల్ మిషన్‌లో భాగం కావడం సంతోషంగా ఉందని, మనం ఓ అద్భుతాన్ని చూశామని ఇంటర్నేషనల్ టన్నెలింగ్ నిపుణుడు అర్నాల్డ్ డిక్స్ తెలిపారు. క్రిస్మస్‌లోగా ఆ కార్మికుల్ని రక్షిస్తానని చెప్పినట్లు గుర్తు చేశారు. ఇండియాలో బెస్ట్ ఇంజినీర్స్ ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆలయం వద్దకు వెళ్లాలని, జరిగినదానికి థ్యాంక్స్ చెప్పాలని ప్రామిస్ చేసినట్లు అర్నాల్డ్ వెల్లడించారు.
తన కోసం తానేమీ పూజలు చేయలేదని, తానేమీ కోరుకోలేదని, కానీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కోసం గుడికి వెళ్లానని, ఆపరేషన్‌లో తోడ్పాటు అందించినవారి కోసం వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఎవరికీ హాని జరగవద్దు అని వేడుకున్నట్లు చెప్పారు. టన్నెల్ సైట్ వద్ద బాబా బౌక్‌నాగ్ ఆలయాన్ని రెస్క్యూ సమయంలో నిర్మించిన విషయం తెలిసిందే. కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావాలని ఆ గుడి వద్ద పూజలు చేశారు.





