
అమెరికాలో గురుద్వారాకు వెళ్లిన భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూను ఖలిస్థానీలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ దుశ్చర్యను అక్కడి సిక్కు సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ‘సిఖ్స్ ఆఫ్ అమెరికా’ కోరింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గురుద్వారాలు ప్రార్థనా స్థలాలని.. వాటిని వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాల నుంచి దూరంగా ఉంచాలని పేర్కొన్నట్లు పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
‘న్యూయార్క్‌లోని గురుద్వారాలో భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్‌ను కొంతమంది అగౌరవపర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారంతా గురుద్వారా సాహిబ్ శాంతి, పవిత్రతలను ఉల్లంఘించారు. ఎటువంటి భయం, ఒత్తిడి లేకుండా భక్తులు స్వేచ్ఛగా గురుద్వారాకు రాగలిగేలా.. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులను కోరుతున్నాం. గురుద్వారాలు ప్రార్థనా స్థలాలు. వ్యక్తిగత రాజకీయ అభిప్రాయాల నుంచి వాటిని దూరంగా ఉంచాలి’ అని ‘సిఖ్స్ ఆఫ్ అమెరికా’ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ జస్దీప్ సింగ్ జస్సీ, అధ్యక్షుడు కన్వల్‌జిత్ సింగ్ సోనీ ఒక ప్రకటనలో కోరారు.
సిక్కుల గురుపూర్ణిమ సందర్భంగా న్యూయార్క్‌లోని హిక్స్‌విల్ గురుద్వారాకు భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధూ వెళ్లారు. ఈ క్రమంలోనే నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయంపై, ఖలిస్థాన్ ఉగ్రవాది పన్నూ హత్యకు జరుగుతున్న కుట్రపై ప్రశ్నలు సంధిస్తూ ఖలిస్థాన్ మద్దతుదారులు.. సంధూపైకి దూసుకువెళ్లేందుకు యత్నించారు. దీంతో గురుద్వారాలోని సిక్కులు వారిని అడ్డుకుంటూ.. తరణ్‌జీత్ చుట్టూ కవచంగా ఏర్పడి ఆయన్ను సురక్షితంగా బయటికి పంపారు. గతంలో బ్రిటన్‌లోనూ భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామిని గురుద్వారాలోకి వెళ్లనీయకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే.





