
భారత ప్రధాని నరేంద్ర మోడీ.. తన నెలవారీ మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ముంబై ఉగ్రదాడుల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “నవంబర్ 26ని మనం ఎప్పటికీ మరచిపోలేము. ఈ రోజునే దేశంలో అత్యంత హేయమైన ఉగ్రవాద దాడి జరిగింది. ఉగ్రవాదులు ముంబైతో పాటు యావత్ దేశాన్ని వణికించారు. కానీ, ఆ దాడి నుంచి మేం కోలుకోవడం, ఇప్పుడు పూర్తి ధైర్యంతో ఉగ్రవాదాన్ని అణచివేయడం భారత్ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని భారత ప్రధాని మోడీ తెలిపారు.
2008 నవంబర్ 26న, పాకిస్తాన్ ఉగ్రవాదులు 10 మంది సముద్ర మార్గం ద్వారా వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 18 మంది భద్రతా సిబ్బందితో సహా 166 మంది మృతి చెందారు. మంది గాయపడ్డారు, అంతేకాకుండా కోట్లాది రూపాయల ఆస్తిని ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చీఫ్ హేమంత్ కర్కరే, ఆర్మీ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబై అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ విజయ్ సలాస్కర్ మృతి చెందారు. దాడులు నవంబర్ 26, 2008న ప్రారంభమై నవంబర్ 29 వరకు కొనసాగాయి.
ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ ప్యాలెస్ అండ్ టవర్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్ జ్యూయిష్ కమ్యూనిటీ సెంటర్ వంటి కొన్ని ప్రదేశాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. అనంతరం భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్. నాలుగు సంవత్సరాల తర్వాత నవంబర్ 21, 2012న అతడిని ఉరితీశారని ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో గుర్తు చేశారు.





