
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లుపై కేంద్రం మళ్లీ దృష్టి సారించింది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ బిల్లును లోక్‌సభలో మళ్లీ ప్రవేశపెడతామని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. గత నెలలో 16వ లోక్‌సభ రద్దు కావడంతో లోక్‌సభలో బిల్లు పాస్ కాకపోవడం.. ఆ తర్వాత రాజ్యసభలో పెండింగ్‌లో పడిపోవడంతో బిల్లు నీరుగారిపోయింది. సాధారణంగా రాజ్యసభలో బిల్లులు పెండింగ్‌లో ఉండి లోక్‌సభ రద్దు అయితే బిల్లులు విఫలం కావుకానీ… అదే లోక్‌సభలో ప్రవేశపెట్టి పెండింగ్‌లో ఉండి లోక్‌సభ రద్దయితే విఫలం అవుతాయి.
రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేయాలని భావించినప్పటికీ అందుకు ప్రభుత్వం దగ్గర సరిపడా సభ్యుల మద్దతు లేకపోవడంతో బిల్లును పాస్ చేయించలేకపోయారు.అంతేకాదు విపక్షాలు కూడా బిల్లులోని పలు అంశాలపై అభ్యంతరం తెలిపాయి. ట్రిపుల్ తలాక్ బిల్లును తిరిగి ప్రవేశ పెడుతారా అన్న ప్రశ్నకు తప్పకుండా ప్రవేశపెట్టి పాస్ చేయిస్తామని అన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్. ట్రిపుల్ తలాక్ బిల్లు తమ మేనిఫెస్టోలో ఉందని ఆయన గుర్తుచేశారు. యూనిఫాం సివిల్ కోడ్ గురించి అడుగగా ప్రభుత్వం రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.




