
శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణంలోని బాహుదా నదీ తీరంలో పురాతన శైవక్షేత్రానికి సమీపంలో ఓ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించినట్లు అన్యమతస్థులు చెబుతున్నారు. ఇది వాస్తవమైతే అనుమతి రద్దు చేసి వేరే ప్రాంతంలో వారికి స్థలం కేటాయించాలి’ అని ఇచ్ఛాపురం అఖిలపక్ష నాయకులు, హైందవ పరిరక్షణ, రైతు సంఘాల ప్రతినిధులు, దీక్షాధారులు డిమాండ్ చేశారు.
హిందువుల మనోభావాలను పరిరక్షించండి
పాతాళహరసిద్ధేశ్వరాలయ మార్గంలో అన్యమత కట్టడానికి కొందరు ప్రయత్నిస్తుండటంతో శుక్రవారం సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర చేపట్టారు. దాసన్నపేట, బజారు కూడలి మీదుగా ఎంఆర్‌వో కార్యాలయానికి చేరుకుని తహసీల్దారు ఎస్.గురుప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. తాము ఎవరికీ అక్కడ స్థలం కేటాయించలేదని.. ఆందోళన అవసరం లేదని తహసీల్దారు పేర్కొన్నట్లు సంఘాల ప్రతినిధులు తెలిపారు. అక్కడి నుంచి బస్టాండు కూడలిలోని ఎర్రన్నాయుడు విగ్రహం వద్దకు చేరుకున్నారు. మానవహారంగా ఏర్పడి హైందవ ధర్మాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. అక్కడి నుంచి ప్రదర్శనగా పురపాలక సంఘ కార్యాలయానికి చేరుకుని ఆ స్థలంలో అన్యమత కట్టడానికి అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. అఖిలపక్ష నాయకులు బుద్దాల నిర్మలారెడ్డి, కొండా శంకర్‌రెడ్డి, దక్కత విశ్వనాథం, కౌన్సిలర్ బచ్చు జగన్నాథరెడ్డి, అయ్యప్ప, శివ దీక్షాధారులు పాల్గొన్నారు.





