News

బెంగాల్‌లో ఆగని ఘర్షణలు.. కంకినారాలో క్రూడ్ బాంబు దాడి.. ఒకరి మృతి

613views

కంకినారా : బెంగాల్‌లో శాంతిభద్రతలు ఇప్పట్లో కుదుటపడేలా కనిపించడంలేదు. ఎన్నికల సందర్భంగా మొదలైన ఘర్షణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా నార్త్ 24 పరిగణా జిల్లా కంకినారా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబు వేయడంతో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. కంకినారాకు చెందిన 68ఏళ్ల మహ్మద్ ముక్తార్ సోమవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి ఆరుబయట కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన కొందరు అగంతకులు వారిపై క్రూడ్ బాంబు విసిరారు. బాంబు పేలుడుతో ముక్తార్ స్పాట్‌లోనే చనిపోయాడు. ఆయన భార్యతో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బాంబు దాడి అనంతరం దుండగులు గ్రామంలో స్వైర విహారం చేశారు. దొరికిన వస్తువు దొరికినట్లు దోచుకుపోయారు.

బాంబు దాడికి సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు గ్రామంలో పోలీసు పహరా ఏర్పాటు చేశారు. అయితే దాడికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తేలలేదు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా బర్రాక్‌పోర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కంకినారాతో పాటు పక్కనే ఉన్న భత్పారాలో ఘర్షణలు చెలరేగాయి. తృణమూల్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన అర్జున్ సింగ్… తృణమూల్ ఎంపీ దినేష్ త్రివేదీని ఓడించారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. అప్పటి నుంచి గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. తాజా బాంబుదాడి ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
Source : One India.