
అయోధ్య ఆలయంలో రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేదుకు ఒకేసారి 15 వేల మంది బస చేసేందుకు వీలుగా టెంట్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు విశ్వ హిందూ పరిషద్ ప్రకటించింది. శ్రీరామజన్మభూమి స్థలానికి రెండు కిలోమీటర్ల ముందు ఖాళీగా ఉన్న ప్రాంతంలో ఈ టెంట్ సీటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు సుమారు 15 వేల మంది వరకు మూడుపూటల ఆహారాన్ని అందించనున్నారు. సాధువుల కోసం ప్రత్యేకంగా ఆహారం తయారు చేస్తారు. చలికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి నేలపై ప్లైవుడ్‌ను పరిచి.. కార్పెట్‌లు, పరుపులు వేస్తున్నారు. 2024 జనవరి 22న నిర్వహించనున్న మహా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనే వివిధ భాషాల వారికి భాషపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అనువాదకులను అందుబాటులో ఉంచనున్నారు.




