News

యాపిల్‌ ఫోన్ల హ్యాకింగ్‌? గోప్యత, డేటాను కాపాడటంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంది : కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

331views

తమ యాపిల్‌ ఫోన్లను హ్యాక్‌ చేసేందుకు ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తుల ద్వారా ప్రయత్నం జరిగినట్లు అప్రమత్తత సందేశాలు వచ్చాయంటూ విపక్ష ఎంపీలు చేసిన ఆరోపణలు దేశంలో కలకలం రేకెత్తించాయి. సుదూర ప్రాంతాల నుంచి ఫోన్లలో చొరబడి, సమాచారాన్ని తస్కరించే ప్రయత్నం జరుగుతోందని ఈ హెచ్చరికల్లో ఉన్నట్లు మహువా మొయిత్రా (తృణమూల్‌), ప్రియాంక చతుర్వేది (శివసేన-యూబీటీ), శశిథరూర్‌ (కాంగ్రెస్‌), రాఘవ్‌ చడ్డా (ఆప్‌), అసదుద్దీన్‌ ఒవైసీ (ఏఐఎంఐఎం) వంటి పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తంచేశారు. సందేశాల స్క్రీన్‌షాట్లను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. హోదా, లేదా తమ చర్యల వల్ల హ్యాకర్లు వ్యక్తిగతంగా వారిని ఎంపిక చేసుకున్నట్లు ఈ సందేశాల్లో ఉంది. హ్యాకింగ్‌ జరిగితే డేటా, కెమెరా, మైక్రోఫోన్‌ సహా అంతా ఎక్కడో దూరాన ఉన్నవారి చేతికి చిక్కుతుందని తెలిపింది. ఇది తప్పుడు హెచ్చరిక కూడా కావొచ్చని చెబుతూనే ఈ హెచ్చరికను సీరియస్‌గా తీసుకోవాలని యాపిల్‌ తెలిపినట్లు శశిథరూర్‌ ‘ఎక్స్‌’లో వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కూడా ఇలాంటిది వచ్చినట్లు తెలుస్తోంది. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌లకూ ఇదే సందేశం వచ్చింది. పారిశ్రామికవేత్త గౌతం అదానీకి ప్రభుత్వం అనుచితంగా కల్పిస్తున్న లబ్ధి గురించి ప్రశ్నిస్తున్నందుకే కేంద్ర సర్కారు ఉద్దేశపూర్వకంగా విపక్ష నేతల ఫోన్లలోకి చొరబడే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు.

సీరియస్‌గా తీసుకుంటున్నాం: వైష్ణవ్‌

గోప్యత, డేటాను కాపాడడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టంచేశారు. హ్యాకింగ్‌ జరిగినట్లు వ్యక్తమైన అనుమానాలపై నిగ్గు తేల్చేందుకు ‘కంప్యూటర్‌ అత్యవసర స్పందన బృందం’ (సీఈఆర్‌టీ) ద్వారా సమగ్ర సాంకేతిక విచారణ జరుపుతామని ప్రకటించారు. యాపిల్‌ ఇలాంటి సందేశాలను 150 దేశాలకు ఇచ్చిందని చెప్పారు. వినియోగదారుల అనుమతి లేనిదే ఏమాత్రం ఫోన్లలోకి చొరబడడం సాధ్యంకాని రీతిలో ఐడీలను నిగూఢపరిచినట్లు యాపిల్‌ స్పష్టం చేసిందన్నారు. యాపిల్‌ పరికరాలు భద్రమైనవైతే 150 దేశాల ప్రజలకు నోటిఫికేషన్లు ఎందుకు వచ్చాయో ఆ సంస్థ స్పష్టతనివ్వాలని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ అన్నారు.

ఒక్కోసారి నకిలీ హెచ్చరికలు వస్తుంటాయి: యాపిల్‌

ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ ఈ ఆరోపణలపై స్పందించింది. నోటిఫికేషన్లను ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులకు ఆపాదించలేమంది. ‘యాపిల్‌ ఫోన్లకు వచ్చే కొన్ని అలర్ట్‌ నోటిఫికేషన్లు నకిలీ హెచ్చరికలు అయిఉండొచ్చు. కొన్ని దాడులను గుర్తించలేం కూడా. నోటిఫికేషన్‌ జారీకి కారణాలను వెల్లడించలేం. దానిని బయటపెడితే హ్యాకర్లు భవిష్యత్తులో మా నిఘా నుంచి తప్పించుకునే అవకాశముంది’ అని తెలిపింది. సంప్రదాయ సైబర్‌ నేరగాళ్లతో పోలిస్తే ప్రభుత్వ సహకారంతో దాడులు చేసేవారు అసాధారణ వనరుల్ని వినియోగిస్తారని, వారిని గుర్తించి కళ్లెం వేయడం కష్టమని పేర్కొంది. ఈ-మెయిల్‌ అటాచ్‌మెంట్లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా లింకులు పంపి హ్యాక్‌ చేస్తారని, అలాంటివి తెరవవద్దని హెచ్చరించింది. ప్రాయోజిత దాడులు అధునాతనంగా ఉంటాయని, వాటికి బాగా నిధులు లభిస్తుంటాయని పేర్కొంది.