News

కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్: కాశ్మీర్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

240views

పాకిస్తాన్.. దారుణానికి తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దుల్లో అకారణంగా కాల్పులు జరిపింది. పేలుళ్లకూ దిగింది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా ఒక్కసారిగా భారత్‌కు చెందిన సరిహద్దు భద్రత జవాన్ల పోస్టులపై దాడులకు పాల్పడింది.

ఈ ఘటనతో జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దు పొడవునా సైన్యం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సమాయత్తమైంది. పాకిస్తాన్ కాల్పులతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. బంకర్లకు తరలుతున్నారు.

జమ్మూ సమీపంలోని ఆర్ఎస్ పురా సెక్టార్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం రాత్రి 8 గంటలకు ఈ కాల్పులు మొదలయ్యాయి. పాకిస్తాన్ రేంజర్లు కాల్పులు జరిపారు. బీఎస్ఎఫ్ పోస్టులపై దాడులకు దిగినట్లు ఆర్మీ అధికారులు నిర్ధారించారు. అర్ధరాత్రి దాటేంత వరకూ ఈ కాల్పులు కొనసాగినట్లు తెలిపారు.

సుమారు మూడు సంవత్సరాల తరువాత పాకిస్తాన్.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఆర్మీ అధికారులు వ్యాఖ్యానించారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా ఈ దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ ఘటన తరువాత సరిహద్దు గ్రామాలను అప్రమత్తం చేశామని చెప్పారు.

కొన్ని చోట్ల పేలుళ్ల శబ్దాలు సైతం వినిపించినట్లు ఆర్నియా గ్రామస్తులు వెల్లడించారు. 2021 తరువాత మళ్లీ పాకిస్తాన్ ఆర్మీ.. బీఎస్ఎఫ్ పోస్టులు, సరిహద్దు గ్రామాలపై కాల్పులు జరిపిందని చెప్పారు. నివాసాలను వదిలి, బంకర్లకు తరలుతున్నామని పేర్కొన్నారు. భారీగా కాల్పులు- ఎదురుకాల్పులు సంభవించినట్లు తెలిపారు.