
శరద్ పూర్ణిమ ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలోని శుక్ల పక్షంలోని పద్నాలుగో తిథి రెండవ రోజున జరుపుకుంటారు. అలాగే ఈ ఏడాది శరద్ పూర్ణిమ అక్టోబర్ 28న ఒక పండుగగా జరుపుకుంటారు. సనాతన ధర్మంలో పూర్ణిమ తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గంగాస్నానం, పూజలు, మంత్రోచ్ఛారణలు మరియు శుభాలు ముఖ్యమైనవి.
పౌర్ణమి రోజున గంగాస్నానం చేయడం వల్ల మనిషి అనుకోకుండా చేసిన పాపాలన్నీ హరిస్తాయని మత విశ్వాసం. ఇది కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు కూడా తెస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం శరద్ పూర్ణిమ తిథి నాడు జరగనుంది. అక్టోబర్ 28 మరియు అక్టోబర్ 29 తేదీల మధ్య అర్ధరాత్రి 1.06 నిమిషాల నుండి 2 గంటల 24 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశం, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలలో కనిపించనుంది.
చంద్రుడు పాక్షికంగా భూమి యొక్క నీడ గుండా వెళుతున్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భారతదేశంలో ఈసారి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కావడంతో సూతక కాలాన్ని పాటించాలని చెబుతున్నారు. చంద్రగ్రహణం ప్రారంభమయ్యే తొమ్మిది గంటల ముందు నుండి సూతక కాలాన్ని పాటించాలి.
భారతదేశంలో న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా మరియు వారణాసి వంటి కొన్ని ప్రముఖ నగరాలలో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. సూతక కాలం అక్టోబర్ 28 మధ్యాహ్నం 02:52 గంటలకు ప్రారంభమవుతుంది. సూతక కాలం 02:22 గంటలకు ముగుస్తుంది. పిల్లలు, వృద్దులు, అనారోగ్యంతో బాధపడే వారికి సూతక కాలం 28వ తేదీ రాత్రి 8 గంటల 52 నిమిషాలుగా చెబుతున్నారు.
దృక్ పంచాంగ్ ప్రకారం, చంద్రగ్రహణం ఉదయం 01:06 గంటలకు ప్రారంభమై 02:22 గంటలకు ముగుస్తుంది.స్థానికంగా ఈ గ్రహణం వ్యవధి ఒక గంట పదహారు నిమిషాల 16 సెకండ్లు ఉంటుందని చెబుతున్నారు. అయితే పెనుంబ్రల్ చంద్ర గ్రహణంగా మాత్రం అక్టోబర్ 28వ తేదీన రాత్రి 11 గంటల 32 నిమిషాలకు ప్రారంభమవుతుందని, మొత్తంగా పెనుంబ్రల్ చంద్రగ్రహణం వ్యవది 4 గంటల 23 నిమిషాల 7 సెకండ్లు గా ఉంటుందని చెబుతున్నారు.
గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఖగోళంలో సంభవించే మార్పులు, గ్రహాల కదలికలు, గ్రహణాలు భూమిపై ఉన్న మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలపై గ్రహణాలు నెగిటివ్ ప్రభావం చూపిస్తాయని చాలామంది భావిస్తారు. అందుకే గర్భిణీలు గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు. శాస్త్రాల ప్రకారం, గ్రహణ సమయంలో గర్భిణీలు ఇంటి నుండి బయటకు రాకూడదు. గ్రహణ సమయంలో బయట సంచరిస్తే పుట్టబోయే బిడ్డకు ప్రమాదం. గర్భస్రావం జరిగే అవాకశం ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.
చంద్ర గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎట్టిపరిస్థితులలోనూ ఆహారం తీసుకోకూడదు. ఇంట్లో పనులు చేయకూడదు. వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. మీరు ఉండే గది కిటికీలను కర్టెన్లతో కప్పండి. పదునైన వస్తువులను దూరంగా ఉండాలి. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేయాలి.
ఆలయాల మూసివేత
ఈ నెల 28న పాక్షిక చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని సాయంత్రం 6.30 గంటలకు ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసి¬వేస్తున్నట్లు ఆలయ వైదిక కమిటీ తెలిపింది. సాయంత్రం అమ్మవారికి పంచ హారతుల సేవ అనంతరం కవాట బంధనం (తలుపులు మూసివేయడం) చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 29న తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేపట్టి 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. 29న సుప్రభాత సేవ, వస్త్ర సేవ, ఖడ్గమాలార్చనను రద్దు చేశారు. శ్రీచక్రనవార్చన, లక్ష కుంకుమార్చన, చండీహోమం, శాంతి కల్యాణాలు యథావిధిగా జరగనున్నాయి.
చంద్రగ్రహణం కారణంగా శ్రీశైల ఆలయ ద్వారాలు 28న సాయంత్రం 5 గంటల నుంచి 29న ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నా¬రు. 29న ఉదయం 7 గంటలకు దర్శనాలు ప్రారంభిస్తారు. 28న మధ్యాహ్నం 3.30 గంటల వరకే సర్వదర్శనం, మధ్యాహ్నం 12.30 గంటల వరకే గర్భాలయ ఆర్జిత అభిషేకాలు నిర్వహిస్తారు. సర్వదర్శనానికి ఉదయం మాత్రమే అవకాశం ఉంటుంది. 28న అన్నప్రసాద వితరణ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకే నిర్వహిస్తామని..ఆ రోజు సాయంత్రం అల్పాహార వితరణ నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.
పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ నెల 28న మూసి వేయనున్నారు. సుమారు 8 గంటలపాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 29న తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య గ్రహణం కాలం ఉండనుంది. అయితే చంద్ర గ్రహణం (Lunar eclipse) సమయానికి 6 గంటల ముందే తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుండడంతో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ నేపథ్యంలో 28వ తేదీన రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసి వేయనున్నట్లు స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ (TTD) అధికారులు కోరారు. తిరిగి గ్రహణం విడిచిన అనంతరం అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఆలయానికి సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
స్వామివారి ఆలయ ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తెరుస్తారు. అంటే చంద్రగ్రహణం కారణంగా శనివారం సాయంత్రం నుంచి తెల్లవారు జామున వరకూ దాదాపు ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో శీవారి సహస్ర దీపాలంకార (Dipalankara)సేవతో పాటు వికలాంగులు, సీనియర్ సిటిజన్ల దర్శనాలను అక్టోబర్ 28న రద్దు చేసినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. గ్రహణం ప్రభావంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలతో పాటు ఇతర ఆలయాలను సైతం మూసివేయనున్నారు.





