News

ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం: పాలస్తీనాకు భారత్ వైద్య సహాయం

259views

గాజా స్ట్రిప్‌లోని హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి కొనసాగుతున్న నేపథ్యంలో, పాలస్తీనాకు వైద్య సహాయం మరియు విపత్తు సహాయ సామగ్రితో భారత వైమానిక దళం (IAF) కార్గో విమానం ఆదివారం ఈజిప్టుకు బయలుదేరింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి అరిందమ్ బాగ్చి సంబంధిత వివరాలను తన ఎక్స్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు.

“భారతదేశం పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయం పంపుతుంది. పాలస్తీనా ప్రజల కోసం దాదాపు 6.5 టన్నుల వైద్య సహాయం మరియు 32 టన్నుల విపత్తు సహాయ సామగ్రిని తీసుకుని IAF C-17 విమానం ఈజిప్ట్‌లోని ఎల్-అరిష్ విమానాశ్రయానికి బయలుదేరింది. కీలకమైన మందులు, శస్త్రచికిత్స వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లు, టార్పాలిన్‌లు, శానిటరీ యుటిలిటీలు, ఇతర అవసరమైన వస్తువులతో పాటు నీటి శుద్దీకరణ మాత్రలు ఉన్నాయి’’, అని అరిందమ్ బాగ్చి తెలిపారు.

పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన అనంతరం సహాయ సామాగ్రితో భారత వైమానిక దళం కార్గో విమానం పాలస్తీనాకు బయల్దేరింది. ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై భారతదేశం తన దీర్ఘకాల వైఖరిని ప్రధాని మోదీ మరోసారి పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో దిగజారుతున్న పరిస్థితిపై తన అందోళనను వ్యక్తం చేశారు. అలాగే పాలస్తీనాకు భారతదేశం తన మానవీయ సాయాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.