
దేవాలయాల్లో ఆదివాసీలు పూజారులుగా ఉండటం అరుదు. కానీ తరతరాలుగా ఆదివాసీ తెగకు చెందిన యానాదులు పూజారులుగా ఉంటున్న ఆలయం ఒకటి తిరుపతి జిల్లాలో ఉంది.
డక్కిలి మండలంలోని దేవుని వెల్లంపల్లిలో స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి దేవస్థానం ఉంది. దేవాదాయ ధర్మాదాయశాఖ అధీనంలో నిత్యం పూజలు జరిగే ఈ శివాలయంలో యానాది కులస్తులే తరతరాలుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
‘‘ఈ ఆలయంలో ప్రస్తుతం పూజలందుకుంటున్న శివలింగాన్ని మా పూర్వీకుడైన పాపయ్యకు పరమశివుడు ఇచ్చాడు. దానికి పూజలు చేస్తే అదే మమ్మల్ని సాకుతుందని ఆ దేవుడు చెప్పాడు’’ అని ప్రస్తుతం అదే ఆలయంలో పూజారిగా ఉన్న పాపయ్య వారసులు చెబుతున్నారు.
‘‘పశువుల కాపరి యోగి అయ్యాడు’’
‘‘మా తాత పాపయ్య కాపలా కాసే పొలంలో రోజూ ఒక ఆవు వచ్చి మేసేది. అది ఆయనకు ఒక్కరికే కనబడేది. దీంతో ఆయన దానిపై నిఘా పెట్టారు. అది రోజూ అర్ధరాత్రి సమయంలో కొండపై నుంచి దిగి వచ్చేది. ఆయనకు దానిపై సందేహం వచ్చి, అది ఎక్కడికి పోతుందో తెలుసుకోడానికి ఆవును వెంబడించాడు. అది స్తంభాలగిరి అనే గుహలోకి వెళ్లి ఆగింది.
తర్వాత అది మాయమైపోవడంతో అది ఏంటో తెలుసుకోవాలని ఆయన అక్కడే 3 నెలలు కూర్చున్నాడు. ఆ సమయంలో స్వామివారు ఆయనకు రకరకాల రూపాల్లో కనిపించారట. చివరకు ఆయన ఏం కావాలో కోరుకో అంటే నీ దర్శనమే చాలు ఇంకేం వద్దు అన్నారట. పాపయ్య శివభక్తుడు. అందుకే ఆయన ఏ కోరికలూ కోరకుండా శివుణ్ణి పూజించే భాగ్యం ప్రసాదించమని కోరాడు’’ అని పాపయ్య వారసులైన గురకల పోలయ్య చెప్పారు.
పాపయ్య 1791లో శివుడు ఇచ్చిన లింగాన్ని వెల్లంపల్లిలో ప్రతిష్టించారని చెబుతారు.
దీంతో ఆ గ్రామం దేవుని వెల్లంపల్లిగా మారింది. సుమారు 25 ఏళ్లు ఆ విగ్రహానికి పూజలు చేసిన పాపయ్య ఆలయానికి వచ్చే భక్తులకు సోది(భవిష్యత్తు) చెప్పడం, వారి కోర్కెలు తీర్చడం చేసేవారని ఆయన వారసులు చెబుతున్నారు.
300 ఏళ్ల నుంచీ తమ కుటుంబాలు ఆ ప్రాంతంలోనే నివశిస్తున్నాయని పోలయ్య చెప్పారు. తమ నాలుగో తరం ప్రస్తుతం స్తంభాలగిరి ఆలయంలో పూజలు చేస్తున్నామని చెప్పారు.
దైవ స్వరూపంగా భావించే గ్రామస్తులు
ఈ ఆలయంలో పాపయ్య ప్రతిష్టించిన విగ్రహానికి ప్రతి సోమవారం పూజలు చేస్తుంటారు. తర్వాత ఆలయం ప్రాంగణంలో ఉన్న వారి పెద్దల సమాధులకు పూజలు చేస్తారు.
ప్రస్తుతం ఈ ఆలయంలో పూజలు చేస్తున్న గురకుల పోలయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో పది మంది వరకూ ఈ ఆలయంలో రకరకాల పనులు చేస్తుంటారు. ఆలయం దగ్గర వాహన పూజలు, స్వామివారికి అర్చనలులాంటివి జరుగుతుంటాయి.
ఈ ఆలయంలో పూజారులుగా పనిచేసే యానాది కుటుంబంలో వారిని తాము దైవ స్వరూపంగా భావిస్తామని చుట్టుపక్కల గ్రామస్థులు చెబుతున్నారు. తమ దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తమ కోసం పూజలు చేస్తారని, వారిపై తమకు చాలా నమ్మకం ఉందని వెల్లంపల్లి పక్కనే ఉండే లింగ సముద్రంకు చెందిన రమణయ్య నాయుడు చెప్పారు.





