News

కొవిడ్‌ వ్యాక్సిన్‌లో పరిశోధనలకు వైద్య శాస్త్రంలో.. ఈ ఏడాది నోబెల్‌

340views

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాల ప్రకటన ప్రారంభమైంది. 2023కు గానూ వైద్య శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని సోమవారం ప్రకటించారు.

వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం-2023 వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్‌ బేస్‌ మాడిఫికేషన్లకు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ వీరికి ఈ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం సోమవారం ప్రకటించింది. గతేడాది మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిన్‌ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ స్వాంటె పాబో ఈ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే.

వైద్యవిభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం వారంపాటు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం రోజున సాహిత్యం విభాగాల్లో గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 9న అర్థశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు.