
సూర్యుడిపై పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 (Aditya-L1) ఉపగ్రహం తన లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. తాజాగా, ఈ ప్రయోగానికి సంబంధించిన కీలక అప్‌డేట్ ఇచ్చింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO). ఈ వ్యోమనౌక ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకుపైగా దూరం ప్రయాణించిందని వెల్లడించింది. ఈ క్రమంలోనే భూ గురుత్వాకర్షణ పరిధిని విజయవంతంగా దాటినట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం లాగ్రెంజ్ పాయింట్ 1 దిశగా పయనిస్తున్నట్లు చెప్పింది.
ఎల్ 1 పాయింట్ భూమి నుంచి సూర్యుడి దివగా సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సూర్యుడికి సంబంధించిన పలు కీలక వివరాలను తెలుసుకోనుంది. ఎప్పటికప్పుడు ఫొటోలను పంపించనుంది. భూ గురుత్వాకర్షణ పరిధిని దాటి ఓ వ్యోమనౌకను ఇస్రో విజయవంతంగా పంపడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంగారకుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ మొదటిసారి ఈ ఘనత సాధించినట్లు ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్-3 విజయవంతం చేసిన తర్వాత.. ఇస్రో ఆదిత్య ఎల్1 మిషన్ ప్రయోగించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని తీసుకుని పీఎస్ఎల్వీ-సీ57 వాహకనౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఆదిత్య ఎల్1లో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి. లాగ్రెంజ్ పాయంట్ 1 వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ్నుంచి ఉపగ్రహం సూర్యుడికి సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది.





