NewsProgramms

మాతృత్వం, కర్తృత్వం, నేతృత్వాలే సమితి ఆదర్శాలు – రాష్ట్ర సేవికా సమితి ఆంధ్ర ప్రాంత సంచాలిక శ్రీమతి సోమేశ్వరి

271views

హిందూ మహిళా సంఘటన, స్త్రీ స్వసంరక్షణ, హిందూ రాష్ట్ర పునర్నిర్మాణం అనే మూడు లక్ష్యాలతో రాష్ట్ర సేవికా సమితి పని చేస్తున్నదని ఆంధ్ర ప్రాంత సంచాలిక శ్రీమతి సోమేశ్వరి తెలిపారు. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లోజరిగిన రాష్ట్ర సేవికా సమితి (RSS మహిళా విభాగం) 15 రోజుల శిక్షణా శిబిరంలో జరిగిన విలేఖరుల సమావేశంలో శ్రీమతి సోమేశ్వరి మాట్లాడుతూ తమ కుమారులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖకు వెళ్తుండటాన్ని చూసిన శ్రీమతి లక్ష్మి బాయి కేల్కర్ (సమితి సేవికలు ఆప్యాయంగా మౌసీజి అని పిలుచుకుంటారు) మహిళల కష్టాలు పోవాలంటే మహిళా లోకం శక్తివంతం కావాలని, అందుకు పురుషులకు ఆరెస్సెస్ మల్లే మహిళలకూ సంఘటనా కార్యం అవసరమని భావించి ఆరెస్సెస్ పెద్దలను కలిసి మహిళలకు కూడా ఆరెస్సెస్ లో ప్రవేశం కల్పించవలసినదిగా మౌసీజీ కోరారని తెలిపారు. పురుషులతో కలిసి కాకుండా మహిళల సంఘటనా కార్యం వేరుగా నిర్వహిస్తే బాగుంటుందన్న పెద్దల సూచన మేరకు శ్రీమతి మౌసీజీ 1936లో నాగపూర్ కి సమీపాన గల వార్ధాలో సమితి శాఖ ప్రారంభించారని శ్రీమతి సోమేశ్వరి తెలిపారు. సమితిని ప్రారంభించిన మౌసీజీ మొట్టమొదటి సమితి ప్రముఖ సంచాలిక కాగా రెండవ ప్రముఖ సంచాలిక శ్రీమతి సరస్వతి తాయి ఆప్టే అని తెలిపారు. లక్ష్మి, సరస్వతుల వలే వీరిద్దరి కలయికలో రాష్ట్ర సేవికా సమితి దిన దిన ప్రవర్ధమానమైనదని సోమేశ్వరి పేర్కొన్నారు.

రాష్ట్ర సేవికా సమితి మహిళల కోసం మూడు ఆదర్శాలను స్వీకరించిందని, అవి మాతృత్వం ,కర్తృత్వం,నేతృత్వం అని ఆమె అన్నారు. ఈ ఆదర్శాలకు ప్రతినిధులుగా జిజియా మాత, అహల్యా బాయి హోల్కర్, ఝాన్సీ లక్ష్మీ బాయి లను చరిత్ర నుండి సమితి స్వీకరించిందని ఆమె తెలిపారు. వీరుడు, ధర్మ రక్షకుడు అయిన కుమారుణ్ణి కనాలని కలలు కని తన కుమారుణ్ణి వీరునిగా తీర్చిదిద్దిన జిజియాబాయి ఆదర్శ మాతృత్వానికి ప్రతీక అని, అలాగే, తమ మాన ప్రాణాలకే కాక ప్రార్ధనా మందిరాలకు కూడా రక్షణ కరవై హిందూ సమాజం దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు సోమనాధ్ మందిరంతో సహా పరాయి మూకల దాడులలో ధ్వంసమయిన అనేక మందిరాలను పునర్నిర్మించిన ధీశాలి అహల్యాబాయి హోల్కర్ కర్తృత్వానికి ప్రతీక అని, అలాగే, తానే స్వయంగా రణ రంగాన నిలిచి ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీ బాయి నేతృత్వానికి ప్రతీక అని, ఆమె వివరించారు. జిజియాబాయి వలే ఆదర్శ మాతగా, అహల్యాబాయి హోల్కర్ వలే కర్తవ్య దీక్షా పరురాలిగా, ఝాన్సీ లక్ష్మీ బాయి వలే ఉత్తమ నాయకురాలిగా నేటి మహిళ తయారు కావాలని, అందుకు తగిన విధంగా తమ శాఖలలో మహిళలకు శిక్షణనిస్తామని శ్రీమతి సోమేశ్వరి తెలిపారు. అలాగే తమ ఆరాధ్య దైవంగా అష్ట భుజా దేవిని సమితి స్వీకరించిందని ఆమె తెలిపారు.

కాగా ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర సేవికా సమితి ఆంధ్ర ప్రాంత కార్యవాహిక శ్రీమతి క్రాలేటి వెంకట భాను మాట్లాడుతూ రాష్ట్ర సేవికా సమితి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 3550 శాఖలు, 850 సేవా ప్రకల్పాలు, 72 యోగా కేంద్రాలు, 250 సంస్కార కేంద్రాలు నిర్వహిస్తున్నదని, అలాగే ఆంధ్ర ప్రాంతంలో 50 శాఖల తోపాటు వివిధ సేవా కార్యక్రమాలను తాము నిర్వహిస్తున్నామని శ్రీమతి సోమేశ్వరి తెలిపారు. నిరాశ్రిత బాలికలకు తమ కార్యాలయాలలో వసతి కల్పించడం తోపాటు, వారి విద్య, వివాహము వంటి బాధ్యతలను కూడా స్వీకరించి వారు జీవితంలో స్థిరపడే వరకు తోడు నిలుస్తున్నామని తెలిపారు. ఆవిధంగా తమ కార్యాలయాలలో వుండి, చదువుకుని, స్థిరపడిన యువతులు నేటికీ పుట్టింటికి వచ్చినట్లుగా తమ కార్యాలయాలకు వచ్చి వెళుతుంటారని, తాము నిర్వహించే సేవా కార్యక్రమాలకు తమ ఆర్ధిక, హార్దిక సహకారాన్నిఅందిస్తుంటారని ఆమె తెలిపారు. ఆ విధంగా బాధ్యతాయుతమయిన పౌరులుగా వారిని తీర్చిదిద్దామనే ఆనందం తమకు కలుగుతూ ఉంటుందని శ్రీమతి భాను పేర్కొన్నారు.