
116views
సూర్యుడి రహస్యాల శోధనకు ఇస్రో చేపట్టిన మొదటి మిషన్ ఆదిత్య ఎల్-1 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఆదిత్య ఎల్-1 ఉపగ్రహ కక్ష్యను పెంచి సూర్యుడి దిశగా ట్రాన్స్-లాగ్రేంజియన్ పాయింట్- 1 దిశలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం వ్యోమనౌక లగ్రాంజ్ పాయింట్-1 దిశగా దూసుకెళుతోంది. ఇప్పటికే ఈ ఉపగ్రహ భూకక్ష్యను నాలుగుసార్లు పెంచారు. తాజాగా ఐదోసారి కక్ష్యను పెంచే ప్రయోగం విజయవంతమైంది. 110 రోజుల ప్రయాణం అనంతరం ఆదిత్య ఎల్-1ను లగ్రాంజ్ పాయింట్- 1 చుట్టూ ఉన్న కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్-1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడిపై పరిశోధనలు మొదలు పెడుతుంది. సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడం ఈ ఉపగ్రహం లక్ష్యం.