
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కర్నాటి రాంబాబు తెలిపారు.ఆలయంలో ఏర్పాట్లపై పాలకమండలి చైర్మన్ మాట్లాడుతూ.. మూలానక్షత్రం రోజున ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని పేర్కొన్నారు. అలాగే ఈవో భ్రమరాంబ మాట్లాడుతూ.. వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూలైన్లు ప్రారంభమవుతాయని… ఎప్పటిలాగే ఐదు క్యూలైన్లు ఉంటాయన్నారు. కేశఖండన శాలకు 600 మంది సిబ్బంది ఉంటారని.. జల్లు స్నానాలకు షవర్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పది ప్రసాదం కౌంటర్లు ఉంటాయని.. మోడల్ గెస్ట్ హౌస్, స్టేట్ గెస్ట్ హౌస్‌ల వద్ద కూడా ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దసరా 9 రోజులూ అంతరాలయ దర్శనం లేదని ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు.