2023 సంవత్సరానికి గాను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ బైఠక్ పుణేలో జరగనుంది. సెప్టెంబర్ 14, 15, 16 తేదీల్లో జరిగే ఈ సమావేశంలో సంఘ అనుబంధమైన 36 సంస్థలకు చెందిన 266 మంది కీలక ప్రతినిధులు ఈ సమన్వయ సమావేశంలో పాల్గొంటారు.
ఈ సమావేశంలో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చలు జరుగుతాయని సంఘ్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్‌జీ వెల్లడించారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పర్యావరణ హిత జీవన విధానం, విలువల ఆధారిత కుటుంబ వ్యవస్థ, సామరస్యపూర్వక జీవితం ప్రాధాన్యత, స్వదేశీ ప్రవర్తన, పౌర విధుల పనితీరు అనే అంశాల గురించి చర్చలు జరుగుతాయని చెప్పారు. సంఘ్ పశ్చిమ మహారాష్ట్ర ప్రాంత కార్యవాహ డాక్టర్ ప్రవీణ్‌జీ దాబడ్‌గావ్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘‘స్వయంసేవకులు శాఖ ద్వారా దేశసేవకు నిరంతరం పని చేస్తుంటారు. శాఖ మాత్రమే కాకుండా సామాజిక జీవనంలో రకరకాల పనుల్లో ఉంటారు. అవన్నీ సేవకు, జాతి నిర్మాణానికి సంబంధించినవే అయి ఉంటాయి. ఈ బైఠక్‌లో పాల్గొంటున్న సంస్థలన్నీ సంఘం ద్వారా స్ఫూర్తి పొంది, సామాజిక జీవనంలోని వివిధ విభాగాల్లో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నవే. ఈ సంస్థలన్నీ ప్రతీ యేటా ఒకసారి సమావేశమై తమ పనులను, అనుభవాలను పంచుకుంటాయి. ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటూ ఉండడానికి ఈ సమావేశం ఉపయోగపడుతుంది. ఈ సంస్థలు దాదాపు ఒకేలాంటి లక్ష్యాలతో పనిచేస్తాయి. చాలాసార్లు కలిసి పనిచేస్తాయి. అలాంటి సమష్టి కృషి గురించి కూడా ఈ సమావేశంలో చర్చించుకుంటారు’’ అని అంబేకర్‌జీ వివరించారు.
ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం సమాజం ఎదుర్కొంటున్న సవాళ్ళను క్రోడీకరించడం, ఒక దిశ నిర్దేశించుకోవడం, జాతీయతా స్ఫూర్తితో పనిచేయడం. తద్వారా చేయవలసిన పని వేగం పెరుగుతుంది. సమాజంలోని దాదాపు ప్రతీ రంగంలోనూ పనిచేస్తున్న విభిన్న సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఆ సంస్థలన్నీ సామాజిక జీవనంలో ఎన్నో యేళ్ళుగా క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. తమ ప్రత్యేకమైన కృషితో ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసాయి. వాటి ప్రతినిధులు ఆయా రంగాల్లో తమ అనుభవాలను ఈ సమావేశంలో పంచుకుంటారు.
ప్రస్తుత పరిస్థితుల్లో, జాతీయ స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని తమ అనుభవాలను వివరిస్తారు. వాటికి సంబంధించిన పలు అంశాలపై చర్చలు జరుగుతాయి. వారు తమ సంస్థ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను పంచుకుంటారు. ఈ బైఠక్‌లో ఆర్ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్, సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబలే, సహ సర్‌కార్యవాహ డాక్టర్ కృష్ణగోపాల్, డాక్టర్ మన్మోహన్ వైద్య, అరుణ్ కుమార్, ముకుంద, రామదత్త చక్రధర్ తదితరులు పాల్గొంటారు. విద్యాభారతి, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, సక్షమ్, వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్, సేవాభారతి, విశ్వహిందూ పరిషత్, రాష్ట్ర సేవికా సమితి, భారతీయ జనతా పార్టీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ తదితర అనుబంధ సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారు.
సామాజిక మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నాలు, కుటుంబంలో అవలంబించవలసిన జీవన విలువలు, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ ఆర్థిక విధానాలు, కుల వివక్షను అంతరింపజేసే సామాజిక సమరసత వంటి అంశాలపై ఈ మూడు రోజుల్లో విస్తృతంగా చర్చలు జరుగుతాయని సునీల్ అంబేకర్ వెల్లడించారు.