News

అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను మసీదు కమిటీ సవాలు చేయడంతో వారణాసిలోని జ్ఞానవాపి శివలింగంపై ఏఎస్‌ఐ చేసిన శాస్త్రీయ దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

148views

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఙానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు సుప్రీంకోర్టు బ్రేకులు వేసింది. మసీదులో శాస్త్రీయ సర్వేను రెండు రోజుల పాటు నిలిపి వేయాలని సుప్రీంకోర్టు ఇవాళ స్టే విధించింది. వారణాసిలోని కాశీ విశ్వనాథుని దేవాలయం సమీపంలోని జ్ఙానవాపి మసీదులో ఇవాళ ఏఎస్ఐ శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భావించింది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మసీదులో శాస్త్రీయ సర్వేకు వారణాసి కోర్టు ఇచ్చిన అనుమతిని సుప్రీంకోర్టు నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. జులై 26 సాయంత్రం 5 గంటల వరకు జ్ఙానవాపి మసీదులో ఎలాంటి సర్వే చేయరాదని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

జ్ఙానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే నిర్వహించడానికి వారణాసి కోర్టు గత వారం అనుమతించింది. కోర్టు ఆదేశాల మేరకు భారత పురావస్తు శాఖ అధికారులు ఇవాళ శాస్త్రీయ సర్వే ప్రారంభించారు. దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారణాసి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై మసీదు కమిటీ స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కోరింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం, స్టే ఉత్తర్వులు జారీచేసింది.

సర్వే సందర్భంగా భారత పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలు ఏమైనా చేపడతారా అని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా…ఒక్క ఇటుకను కూడా తొలగించమని…అలాంటి ప్రణాళిక కూడా తమ వద్ద లేదని ఆయన కోర్టుకు తెలిపారు. ప్రస్తుతానికి అక్కడ కొలతలు, రాడార్ ప్రక్రియ కార్యక్రమాలు, ఫోటోలు మాత్రమే తీసుకుంటామని సొలిసిటర్ జనరల్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. మసీదు నిర్మాణాలపై ఈ సర్వే ఎలాంటి ప్రభావం చూపదని ఎస్‌జీ కోర్టుకు విన్నవించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం రెండు రోజుల పాటు స్టే విధించింది. జులై 26 సాయంత్రం 5 గంటల వరకు మసీదులో ఎలాంటి సర్వేలు చేయవద్దని కోర్టు స్టే విధించింది. మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టుకు వెళ్లేందుకు సుప్రీం ధర్మాసనం అనుమతించింది.