News

యూపీలో ఎన్‌కౌంటర్‌.. మరో గ్యాంగ్‌స్టర్‌ హతం

228views

యూపీలో కరుడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్లను ఏరివేసే పనిలో పడింది సీఎం యోగి ఆదిత్యనాత్‌ ప్రభుత్వం. యోగీ సీఎం అయ్యాక మార్చి 2017 నుంచి ఇప్పటి వరకు 183 మంది గ్యాంగ్‌స్టర్లు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఇటీవల రాజకీయవేత్తగా ఎదిగిన గ్యాంగ్‌స్టర్ అతిక్‌ అహ్మద్‌, అతని సోదరుడు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరవకముందే మరో గ్యాంగ్‌స్టర్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

జాతీయ రాజధాని ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌ వంటి ప్రాంతంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గ్యాంగ్‌స్టర్‌గా పేరుమోసిన అనిల్‌ దుజానాను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు మీరట్‌లో కాల్చి చంపారు. పశ్చిమ యూపీకి చెందిన అనిల్ దుజానాపై హత్యలు, దోపిడీలు, భూ కబ్జాలు వంటి కేసులు నమోదయ్యాయి. మొత్తం 60కి పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2012 నుంచి జైల్లో ఉంటున్నాడు.

హత్య కేసులో బెయిల్ పొంది వారం రోజుల క్రితమే దుజానా జైలు నుంచి విడుదలయ్యారు. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే తనపై నమోదైన హత్య కేసులో కీలక సాక్షులలో ఒకరిని బెదిరించడం ప్రారంభించాడని పోలీస్‌ వర్గాలు తెలిపాయి. సాక్షిని చంపాలని ప్లాన్‌ చేసుకున్నట్లు పేర్కొన్నాయి. దీంతో అతడిని అరెస్ట్ చేసేందుకు స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగింది. మీరట్‌లోని ఓ గ్రామంలో దుజానా, అతని గ్యాంగ్‌ దాగి ఉందని తెలియడంతో అక్కడికి పోలీసులు చేరుకున్నారు.

విషయం తెలుసుకన్న గ్యాంగ్‌స్టర్‌ ఎస్‌టీఎఫ్‌ బలగాలపై కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దీంతో పోలీసు బృందంఎదురు కాల్పులు జరిపిందని ఈ ఆపరేషన్‌లో దుజానా మరణించినట్లు పేర్కొన్నారు.