News

తిరుపతికి ఆర్టీసీ విద్యుత్ ఏసీ బస్సులు- నాన్‌స్టాప్ సర్వీసులు

222views

ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల సంఖ్యను మరింత పెంచారు. తిరుపతి గమ్యస్థానంలో రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి వాటిని దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తోన్నారు. ప్రస్తుతం తిరుపతి-తిరుమల మధ్య రాకపోకలు సాగిస్తోన్న ఈ విద్యుత్ ఆధారిత ఏసీ బస్సు సర్వీసులను మరింత విస్తృతం చేశారు. క్రమంగా వాటి సంఖ్యను మరింత పెంచనున్నారు.

ఇవ్వాళ 12 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికుల కోసం అందుబాటులోకి వచ్చాయి. కడప నుంచి తిరుపతికి ఈ 12 బస్ సర్వీసులను ప్రవేశపెట్టారు. ఇవన్నీ నాన్‌స్టాప్ సర్వీసులే. కడప నుంచి బయలుదేరి నేరుగా తిరుపతికి చేరుకుంటాయి. ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ మల్లికార్జున రెడ్డి కడపలో ఈ ఉదయం ఈ బస్సులను బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.

తొలి సర్వీస్ తెల్లవారు జామున 4:30 గంటలకు కడప నుంచి తిరుపతికి బయలుదేరి వెళ్తుంది. అదే సమయానికి తిరుపతి నుంచి కూడా మరో ఎలక్ట్రిక్ ఏసీ నాన్‌స్టాప్ బస్ సర్వీసు కడపకు బయలుదేరుతుంది. సాయంత్రం 7:30 గంటల వరకు ఈ బస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 7:30 గంటలకు చివరి ట్రిప్ ఉంటుంది. రోజూ 12 బస్సులు 18 ట్రిప్పులు మేర రాకపోకలు సాగిస్తాయి.

ఇందులో పెద్దలకు 340 రూపాయలు, పిల్లలకు 260 రూపాయల ఛార్జీని వసూలు చేస్తారు. ఈ బస్సుల కోసం ఛార్జింగ్ స్టేషన్లను ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఇదివరకే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలిపిరి బస్ స్టేషన్‌లో ఈ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. కడప ఆర్టీసీ డిపోలోనూ ఛార్జింగ్ స్టేషన్‌ను కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చారు.

కాగా- ఈ నెల 6వ తేదీన తిరుపతి నుంచి మదనపల్లె మధ్య మరో 12 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. పర్యావరణ కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా ఇప్పటికే తిరుమల-తిరుపతి మధ్య ఎలక్ట్రిక్ బస్సులను నడిపిస్తోన్నామని మల్లికార్జునరెడ్డి తెలిపారు. దశలవారీగా ఆ సర్వీసులను మరింత విస్తరిస్తామని వివరించారు.