News

దూసుకొస్తున్న ‘ఫొని’

1kviews

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ తుఫాను తీవ్ర రూపం దాల్చింది. తీవ్రమైన‌ పెనుతుఫానుగా మారింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతోంది. క్రమంగా పశ్చిమ వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. గడిచిన ఆరు గంటలుగా 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఒడిశాలోని పూరీకి 710 కిలోమీటర్లు, విశాఖకు 460 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 454 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాను మరింత బలోపేతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మధ్యాహ్నానికి దిశ మార్చుకుని ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉందని.. ఈ నెల 3న మధ్యాహ్నాం ఒడిశాలోని పారాదీప్‌కు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాత‌వ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో 205 కిలోమీటర్ల ప్రచండ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.. ఇప్పటికే తుఫాను ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారిందని.. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు

తుఫాను ప్రభావం ఏపీపై తక్కువగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ నెల 2, 3 తేదీల్లో శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయి. విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ఒక  మోస్తరు వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలో తీరం వెంబడి గంట‌కు 80- 90 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీచే అవ‌కాశ‌ం ఉంది. తుఫాను గమనాన్ని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది.