News

వామపక్ష రక్కసి పంజా – 15 మంది జవాన్లు బలి

1kviews

హారాష్ట్ర లోని గడ్చిరౌలిలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలపై మావోయిస్టులు చేసిన దాడిలో ఏకంగా 15 మంది సైనికుల ప్రాణాలు పోయాయి. భద్రతాబలగాలపై ఐఈడీ బ్లాస్ట్లు జరిపారు. మందుపాతరలతో జరిపిన ఈ దాడిలో 15 మంది సైనికులు అమరులయ్యారని వార్తలు వచ్చాయి. 24 గంటల్లో ఈ ప్రాంతంలో మావోయిస్టులు జరిపిన రెండో దాడి ఇది. ప్రస్తుతం మావోయిస్టులకు బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

కొన్ని గంటల క్రితమే గడ్చిరోలి జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడంపై మావోయిస్టులు కన్నెర్ర చేశారు. దాదాపు 27 భారీ వాహనాలకు నిప్పు పెట్టారు. మరోసారి ఇక్కడ కనిపిస్తే ప్రాణాలు దక్కవని కార్మికులు, నిర్మాణ సిబ్బందిని హెచ్చరించారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. గడ్చిరోలిలో పనులు జరుగుతున్న ప్రాంతానికి దాదాపు 150 మంది మావోయిస్టులు చేరుకున్నారు. అనంతరం తుపాకీలతో బెదిరించి కాంట్రాక్టర్లు, కార్మికులు, వాహనదారులను ఓ చోట బంధించారు. ఆ తర్వాత అన్ని వాహనాలపై పెట్రోల్, డీజిల్ పోసి తగులబెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తాము ఈ చర్యకు పాల్పడినట్లు మావోయిస్టులు కరపత్రాలను వదిలిపెట్టారు. కాంట్రాక్టర్ల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న బలగాలు కూంబింగ్ ప్రారంభించాయి. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు, దాదాపు రూ.10 కోట్ల వరకూ నష్టం జరిగినట్లు తెలిపారు.