
ఆంధ్రాభద్రాద్రి ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణం బుధవారం రాత్రి 8-10 గంటల మధ్య వైభవంగా జరగనుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం, కడప జిల్లా ప్రభుత్వ అధికారుల సంయుక్త ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని, కల్యాణ వేదికను, చుట్టుపక్కల ప్రాంగణాలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది దేవతల విద్యుత్ కటౌట్‌లను ఏర్పాటు చేసి భారీ ఎత్తున ఏర్పాట్లను పూర్తి చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన వందలాది మంది సిబ్బంది, అన్ని శాఖల అధికారులు, కడప జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీ, జిల్లాలోని అన్ని శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సుమారు లక్ష మందికి పైబడి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కల్యాణోత్సవ ఏర్పాట్లను పూర్తి చేశారు. కల్యాణోత్సవానికి వచ్చే భక్తులకు పెద్ద ఎత్తున గ్యాలరీలను ఏర్పాటు చేశారు. గ్యాలరీలలోని వెళ్లే భక్తులకు ప్రత్యేక సిబ్బందిచే అక్కడికక్కడే ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను, అన్నప్రసాదాలను, మజ్జిగ, వాటర్ ప్యాకెట్లను కూడా అందజేయనున్నారు. ఎస్పీ అన్బురాజన్ ఆఽధ్వర్యంలో సుమారు 4 వేల మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. కడప-రేణిగుంట మీదుగా వెళ్లే వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లించారు. రేణిగుంట-తిరుపతి-కోడూరు-రాజంపేట మీదుగా కల్యాణానికి వచ్చే భక్తులను ఒంటిమిట్ట చెరువు వద్ద నిలిపివేసి ఆలయం నుంచి చెరువు కట్ట వద్దకు వచ్చే ఉచిత వాహనాల ద్వారా కల్యాణ వేదిక వద్ద తీసుకెళ్లనున్నారు. అదే విధంగా కడప-భాకరాపేట మీదుగా కల్యాణానికి వచ్చే భక్తులను మాధవరం వద్దే నిలిపివేసి కల్యాణ వేదిక వద్దకు తీసుకురానున్నారు. కనీవిని ఎ రుగని రీతిలో భారీ ఏర్పా ట్లు చేస్తున్నారు. ఎస్వీ బీసీ చానల్ ద్వారా భక్తులందరూ కల్యాణాన్ని తిలకించడానికి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
కల్యాణ వేదిక వద్ద విశేషాలివే..
కల్యాణోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం 4.30-5.30 గంటల మధ్య అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే శ్రీరామనామామృతం భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6.15-7.45 గంటల మధ్య తిరుపతి ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ ఉమా ముద్దుబాల ఆధ్వర్యంలో శ్రీరామకృతులు నృత్య కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహిస్తారు. అంతకుముందు రాములవారి కల్యాణానికి సంబంధించిన సీతమ్మ వారి కోరికను శాస్త్రరీత్యా తెలుసుకోవడాన్ని కాంతకోరికగా నిర్వహిస్తారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఎదురెదురుగా ఉంచి పూలమాలలు మార్చుకునే ప్రక్రియను ఎదుర్కోలు ఉత్సవం అంటారు. అనంతరం రాత్రి 8-10 గంటల మధ్య కల్యాణం జరుగుతుంది. ముందుగా భగవత్ విజ్ఞాపనం, సభ అనుజ్ఞ లోకకల్యాణం కోసం సంకల్పిస్తారు. కల్యాణంలోని పదార్థాలన్నీ భగవంతుని మయం చేసేందుకు పుణ్యాహవచనం నిర్వహిస్తారు. తదనంతరం రక్తాబంధనం, యజ్ఞోపవీతధారణ, కన్యావరణం, మధుపర్కార్చన చేస్తారు. మహాసంకల్పం అనంతరం కన్యాదానం చేసి సీతారామచంద్రుల ప్రవచనాలు చదువుతారు. వంశస్వరూపాన్ని స్తుతిస్తారు. అగ్నిప్రతిష్టాపన తరువాత మంగళాష్టకం, చూర్ణిక పఠిస్తారు. ఆ తరువాత మాంగళ్యసూత్ర పూజ, మంగళసూత్రధారణ, అక్షతారోహపణం చేస్తారు. స్వామి నివేదన, వేదస్వస్తి, మహదాశీర్వచనంతో కల్యాణ ఘట్టాన్ని పూర్తి చేస్తారు.
మోహినీ అలంకారంలో విహారం
ఒంటిమిట్ట కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవరోజు మంగళవారం ఉదయం మోహినీ అలంకారం, రాత్రి గరుడ వాహనంలో కోదండరాముడు భక్తులను కరుణించాడు. భక్తజనం శ్రీరామనామజపంతో కీర్తిస్తుండగా మంగళవాయిద్యాలు, వేదమంత్రాలు, చెక్కభజనలు, కోలాటాల మధ్య స్వామి వారి ఊరేగింపు వైభవంగా సాగింది. భక్తులు పెద్ద ఎత్తున మంగళహారతులు సమర్పించి స్వామిని దర్శించుకున్నారు.
గరుడవాహనంపై గ్రామోత్సవం
గరుడవాహనంపై సీతారామలక్ష్మణులు మంగళవారం రాత్రి మాడ వీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామోత్సవంలో భారీగా భక్తులు పాల్గొన్నారు. కేరళ డప్పులు, చెక్కభజనలు మధ్య భక్తజనులు శ్రీరామనామ జపం చేస్తుండగా గరుడ వాహనసేవ వైభవోపేతంగా సాగింది. భక్తులు పెద్దఎత్తున పాల్గొని మొక్కుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు
కోదండరాముని బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం జరగబోయే సీతారాముల కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ స్వామివార్లకు పట్టువస్త్రాలు, ము త్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. టీటీడీ తరపున టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కల్యాణోత్సవానికి టీటీడీ తరపున పట్టువస్త్రాలు అందజేయనున్నారు.





